మున్సిపాలిటిక్స్‌ మాయాజాలం!

2 Apr, 2018 01:59 IST|Sakshi

కొత్త మున్సిపాలిటీలు, పాతవాటి విస్తరణలో రియల్‌ ఎస్టేట్‌ దందా

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అడ్డగోలుగా మున్సిపాలిటీల విస్తరణ

నిబంధనలను తుంగలోతొక్కి గ్రామాల విలీనం

పట్టణ ప్రాంత లక్షణాలేవీ లేకున్నా పరిగణనలోకి..

కొన్నిచోట్ల ప్రజలుండే ప్రాంతాలు వదిలేసి భూములు మాత్రమే డీనోటిఫై

తమ భూముల ధరలు పెంచుకునేందుకు నేతల దందా

జిల్లాల్లో అధికారులపై ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిళ్లు!

అసెంబ్లీలో బిల్లు పెట్టే ముందు భారీగా మార్పుచేర్పులు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజల సౌకర్యం, అభివృద్ధి కోసం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తారు.. అప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లోకి శివారు గ్రామాలను కలుపుతారు.. ఇలా చేయాలంటే ఆ గ్రామాలు/ఆవాస ప్రాంతాలకు పట్టణ ప్రాంత లక్షణాలు ఉండాలి.. వ్యవసాయేతర ఉపాధి నుంచి వాణిజ్య సముదాయాల వరకు పట్టణాల తరహా సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలి. కానీ తాజాగా రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, పాత మున్సిపాలిటీల విస్తరణలో పలుచోట్ల ఇందుకు భిన్నంగా జరిగింది.

కొన్నిచోట్ల పట్టణాల తరహా లక్షణాలు లేకున్నా, పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్నా కూడా పలు గ్రామాలను కొత్త/పాత మున్సిపాలిటీల్లో చేర్చారు. దగ్గరగా ఉన్న గ్రామాలు/ఆవాసాలను వదిలేసి వాటికి అవ తల దూరంగా ఉన్నవాటిని కలిపేశారు. ఉదా హరణకు.. జగిత్యాల మున్సిపాలిటీకి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరూర్‌ గ్రామాన్ని వదిలేసి.. దానికి అవతల మరో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారక రామనగర్‌ను మున్సిపాలిటీలో కలిపారు.

మరికొన్ని చోట్ల గ్రామాల్లో ఇళ్లు, ఆవాసాలను వదిలేసి.. కేవలం వాటి పరిధిలోని భూము లను మాత్రమే విడదీసి మున్సిపాలిటీల్లో చేర్చారు. పురపాలక సంస్థలంటేనే జనాభా ఎక్కువగా ఉన్న చోట వారికోసం ప్రణాళికా బద్ధంగా అభివృద్ధికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలుకల్పించే వ్యవస్థలు. అలాం టిది ఇళ్లు, ఆవాసాలను వదిలేసి.. కేవలం భూములను మాత్రమే మున్సిపాలిటీల్లో కలిపేశారు. కొత్తగా ఏర్పాటైన పెద్దపల్లి మున్సి పాలిటీ పరిధిలోకి పెద్దకల్వల, పెద్దబొంకూర్‌ గ్రామాలకు చెందిన భూములను మాత్రమే చేర్చడం దీనికి ఉదాహరణ.

... మరి ఇలా అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, పాత మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనానికి కారణం స్థానిక నేతల రియల్‌ ఎస్టేట్‌ దందాలేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ భూముల మార్కెట్‌ విలువ పెంచుకునేందుకు ఈ దిశగా పావులు కదిపారనే విమర్శలు వస్తున్నాయి.

ఏలికల కోసమేనా..?
రాష్ట్రంలో 173 గ్రామాల విలీనంతో 71 కొత్త పురపాలికల ఏర్పాటుకు, మరో 41 పాత పురపాలికల్లో 136 గ్రామాలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల్లోనే పురపాలక శాఖ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అయితే గ్రామాల విలీనం విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు తమ భూములను పట్టణ ప్రాంతాల పరిధిలోకి తీసుకొచ్చి మార్కెట్‌ విలువను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేందుకు పావులు కదిపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే దగ్గరగా ఉన్న ఆవాసాలను వదిలి దూరంగా ఉన్న వాటిని కలపడం.. గ్రామాలను వదిలేసి, వాటి భూములను మాత్రమే విలీనం చేయడం వంటి మార్పులు జరిగాయని తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకంగా జిల్లాల నుంచి అధికారులను హైదరాబాద్‌కు పిలిపించి.. గ్రామాల విలీన ప్రక్రియను తమకు నచ్చినట్టుగా మార్చినట్టు సమాచారం.

పట్టణ స్వభావమున్న గ్రామాలే కలపాలి
మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలతో స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఆయా గ్రామాల్లో 40 శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉండటం.. ఫంక్షన్‌ హాళ్లు, సినిమా థియేటర్లు, మార్కెట్‌ యార్డులు, హోటళ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలు వంటి పట్టణ ప్రాంత స్వభావం కలిగి ఉండటం వంటివి ఉండాలి. ఈ మేరకు మున్సిపాలిటీల్లో కలిపే గ్రామాలు/ఆవాసాలపై జిల్లా అధికారుల ప్రతిపాదనలే కీలకం. కానీ చాలా చోట్ల ఈ నిబంధనలను పాటించలేదు. అంతేకాదు గ్రామాల్లో ప్రజలు, నివాసాలను వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాలు, భూములను మాత్రమే మున్సిపాలిటీల్లో కలిపారు. దీంతో గ్రామ పంచాయతీలు భారీగా నష్టపోనున్నాయి. ఆయా భూములపై వచ్చే ఆదాయమంతా మున్సిపాలిటీకి అప్పగించినట్లవుతుంది. అంతేకాదు పంట పొలాలు లేకుంటే వ్యవసాయాధారం లేదనే కారణంతో ఉపాధి హామీ పథకం నిధులనూ ఆ గ్రామం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

గ్రామాలు వద్దు.. భూములే ముద్దు
పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ.. ఐదు గ్రామ పంచాయతీలను దానిలో విలీనం చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో మూడు గ్రామాలను విలీనం చేసిన ప్రభుత్వం.. పెద్దకల్వల, పెద్దబొంకూరు గ్రామాలను మాత్రం మినహాయించింది. కానీ ఆఖరి మార్పులు చేర్పుల్లో ఈ రెండు గ్రామాల్లో ఇళ్లుండే ప్రాంతాలను వదిలేసి.. మూడు వందల ఎకరాలకుపైగా భూములను మాత్రమే మున్సిపాలిటీలో కలిపేశారు. కలిపితే గ్రామం మొత్తం విలీనం చేయాలని, లేకుంటే ఇబ్బందులు వస్తాయన్న అధికారుల విజ్ఞప్తులు నేతల పైరవీలలో కొట్టుకుపోయాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, స్థానిక నేతలు తమ భూముల విలువను అమాంతం పెంచుకునేందుకే కొన్ని సర్వే నంబర్ల భూములను మున్సిపాలిటీలో చేర్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రణాళిక ప్రకారమే భూముల అధీనం
సిద్దిపేట మున్సిపాలిటీ విస్తరణ విషయంలో చుట్టూరా ఉన్న గ్రామాలను వదిలేసిన ప్రభుత్వం.. కేవలం కొన్ని సర్వే నంబర్లలోని భూములను మాత్రమే విలీనం చేసింది. తొలుత సిద్దిపేట మున్సిపాలిటీలో ఐదారు గ్రామాలను విలీనం చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో జరిగిన మార్పులు చేర్పుల్లో.. పొన్నాల, మిట్టపల్లి, ఎన్‌సాన్‌పల్లి, చినగుండవెల్లి గ్రామాల్లో ప్రజలుండే ప్రాంతాలను వదిలేసి.. నలభై సర్వే నంబర్లలో పరిధిలోని భూములను మాత్రమే విలీనం చేశారు. అటు సంగారెడ్డి పరిసరాల్లో పోతిరెడ్డిపల్లి, చింతల్‌పల్లిలను మున్సిపాలిటీలో విలీనం చేసిన అధికారులు.. నేతల ఒత్తిళ్లతో మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలను వదిలేసి సర్వే నంబర్లు 210 నుంచి 365 మధ్య ఉన్న భూములను మాత్రమే మున్సిపాలిటీలో కలిపారు.

‘హద్దులు’ దాటేసిన విలీనం
జగిత్యాల మున్సిపాలిటీలో అయితే విలీన ప్రక్రియ ఎన్నో ‘సిత్రాలు’ చూపిస్తోంది. మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్న గ్రామాలను వదిలేసి.. వాటికి అవతల ఉన్న గ్రామాలను మాత్రం విలీనం చేయడం గమనార్హం. జగిత్యాల మున్సిపాలిటీకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరూర్‌ గ్రామాన్ని వదిలేసి.. దాని అవతల ఉన్న తారకరామనగర్‌ను విలీనం చేశారు. ఇదేమిటో అంతుచిక్కక స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్సిపాలిటీకి మరోదిక్కున తిప్పన్నపేట గ్రామాన్ని వదిలేసి దాని అవతల ఉన్న శంకులపల్లెను విలీనం చేశారు. జగిత్యాల–నిజామాబాద్‌ రహదారి వెంట ఉన్న హస్నాబాద్‌ గ్రామంలో జనం ఉండే ప్రాంతాలను వదిలి భూములను మాత్రం కలిపారు. అధికార పార్టీలో అత్యంత కీలక నేత ఒత్తిళ్లతోనే ఈ అడ్డగోలు తతంగం నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి.

పంచాయతీ పరిధిలోనే ఉండాలి
‘‘మా పెద్దకల్వల గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో కలపవద్దని గ్రామస్తులంతా ఒత్తిడి చేయడంతో పంచాయతీగానే ఉంచారు. కానీ గ్రామంలోని భూములను మాత్రం మున్సిపాలిటీలో కలిపారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. పంచాయతీ పరిధిలోనే భూములు ఉండేలా చర్యలు తీసుకోవాలి..’’   – సలేంద్ర రాములు, పెద్దకల్వల

భూములను విడదీశారు
‘‘మున్సిపాలిటీ పరిధి పెంచడం కోసమని దగ్గరగా ఉన్న గ్రామాలకు చెందిన భూములను కలపడం సరికాదు. దీనివల్ల మాకు నష్టం కలగడంతోపాటు తీవ్ర గందరగోళం ఎదురవుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుని.. మా భూములను పంచాయతీ పరిధిలోనే ఉంచాలి..’’   – నర్ల లింగయ్య, పెద్దబొంకూర్‌

ప్రజలు వద్దు.. భూములు కావాలి..
‘‘జగిత్యాలకు దగ్గరే ఉన్న మా తిమ్మాపూర్‌ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ చివరికి గ్రామాన్ని వదిలిపెట్టి.. శివారులోని కొన్ని సర్వే నంబర్లలోని భూములను మాత్రం మున్సిపాలిటీలో కలిపారు..’’  - కాటిపల్లి మునీందర్‌రెడ్డి, తిమ్మాపూర్, జగిత్యాల జిల్లా

ముందున్న గ్రామాన్ని వదిలేశారు
జగిత్యాలకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరూర్‌ గ్రామాన్ని వదిలేసి.. దూరంగా ఉన్న మా టీఆర్‌ నగర్‌ను మున్సిపాలిటీలో కలిపారు. అధికారులు, రాజకీయ ఒత్తిళ్లతోనే ఇలా చేశారు. పట్టణానికి దూరంగా ఉన్న మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసం.. – కొండ శ్రీనివాస్, టీఆర్‌ నగర్‌ సర్పంచ్, జగిత్యాల జిల్లా

>
మరిన్ని వార్తలు