బైరటీస్‌ ఖనిజానికి కాళ్లొచ్చాయ్‌..!

21 Nov, 2018 18:55 IST|Sakshi

నూతన కలెక్టరేట్‌ వెనుక నిల్వ ఉంచిన బైరటీస్‌ ఖనిజం 

ఖమ్మంఅర్బన్‌: నగరంలోని ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి చెందిన భూమిలో తవ్వకాల్లో బయటపడిన బైరటీస్‌ ఖనిజాలను రాత్రికి రాత్రే అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఖనిజాలను ముందుగా సమీపంలోని రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తున్నారని, రాత్రి వేళ తరలిస్తున్నారని సమాచారం. మూడేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో పుట్టకోట సమీపంలోని రైతుల పొలాల్లో దొరికిన బైరటీస్‌ ఖనిజాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఎగు మతి చేశారు. దీనిపై అందిన ఫిర్యాదులతో అప్ప ట్లో సంబంధిత అధికారులు దాడులు చేశారు.

నిల్వలను స్వాధీనపర్చుకున్నారు. తాజాగా, అదే ప్రాం తంలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో బైరటీస్‌ ఖనిజం బయటపడింది. దానిని నూతన కలెక్టరేట్‌ సమీపం లోని భూముల్లో నిల్వచేసి, రాత్రివేళ లారీల ద్వారా తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఖనిజం ధర నాణ్యతనుబట్టి 700 నుంచి 2000 రూపాయల వరకు పలుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 10నుంచి 15లారీలలో ఖనిజం నిల్వలను తరలిం చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం అక్కడ ఒక లారీ బైరటీస్‌ గనినిల్వలు ఉన్నాయి. బైరటీస్‌ వ్యాపారు లే ఈ రాయిని తరలిస్తున్నారని, వెంచర్‌ నిర్వాహకు లకు కొంత ముట్టజెబుతున్నారని ప్రచారం సాగుతోంది.

 ఈ ఖనిజాన్ని ఏం చేస్తారంటే..
ఈ బైరటీస్‌ ఖనిజాన్ని కెమికల్స్‌లో, సిమెంట్‌ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. కోదాడ సమీపంలో సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఖనిజాన్ని కోదాడ సమీపంలోగల ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్టు తెలిసింది.
మాకు తెలియదు... 
దీనిపై మైనింగ్‌ ఏడీ నరసింహారెడ్డి, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ రాజారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘బైరటీస్‌ను అక్రమంగా తరలిస్తున్న విషయం మా నోటీసుకు రాలేదు. వెంటనే పరిశీలిస్తాం’’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు