సీసెడు తాగినందుకే సోయి తప్పుతున్నారు

29 Feb, 2020 10:34 IST|Sakshi

జిల్లా కేంద్రంలోని ఓ కల్లు దుకాణంలో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మృతిచెందాడు. కల్తీ కల్లు తాగడం వల్లే అతడు మరణించాడని బంధువులు ఆందోళన చేశారు. కల్లు విక్రయదారులు వారిని సముదాయించి, కొంత పరిహారం చెల్లించి, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. సమీపంలోని మరో కల్లు దుకాణం నిర్వాహకులనుంచి కూడా కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం.. కన్న కూతురిపైనే అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ తండ్రికి సంబంధించిన ఘటన ఇటీవల మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ప్రతిరోజూ మత్తుపదార్థాలు కలిపిన కల్లును సేవించడం, తన కుటుంబ సభ్యులకు కూడా తెచ్చి ఇవ్వడం చేసేవాడని తెలిసింది. జరిగిన దారుణానికి కల్తీకల్లు సేవించడం కూడా కారణమేనని భావిస్తున్నారు .

సాక్షి, కామారెడ్డి : జిల్లాలో 22 కల్లు డిపోలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రెండు కల్లు తయారీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణంలో 14 కల్లు దుకాణాలు ఉండగా చుట్టు పక్కల గ్రామాల్లోని కొన్ని కల్లు దుకాణాలకు సైతం జిల్లా కేంద్రంలోని కల్లు తయారీకేంద్రాలనుంచే కల్లును సప్లయ్‌ చేస్తున్నారు. ఈత, తాటి చెట్ల నుంచి తీసే కల్లును నామమాత్రంగా కలుపుతారు. క్లోరోఫాం, డైజోఫాంలాంటి మత్తు పదార్థాలను కలుపుతూ కల్తీ కల్లు తయారు చేసి, విక్రయిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. కల్లు విక్రయాలను పెంచుకోవడానికి మత్తు పదార్థాలను ఎక్కువ మొత్తంలో కలిపి అమ్ముతున్నారని తెలుస్తోంది. హైడోస్‌ కల్లుకు జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాలకు పెట్టింది పేరు.. దేవునిపల్లి, రామేశ్వర్‌పల్లి, సిరిసిల్లరోడ్, అంగడిబజార్, హైదరాబాద్‌ రోడ్, చిన్నమల్లారెడ్డి, సరంపల్లి తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్తీకల్లు విక్రయాలు ఎక్కు వగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా దుకాణాల్లోనూ కల్తీ కల్లు అమ్ముతున్నారు.  

వీధిన పడుతున్న కుటుంబాలు 
కల్తీకల్లు కారణంగా అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కల్లుకు బానిసలవుతూ ఎంతోమంది కుటుంబాలను పట్టించుకోవడం లేదు. పొద్దంతా పని చేయగా వచ్చే డబ్బులను కిక్కు కోసమే ఖర్చు చేస్తున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలు, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గొడవలు నిత్యం పోలీస్‌ స్టేషన్‌ల వరకు వస్తున్నాయి. కొన్ని ఆత్మహత్యలు, హత్యలకు మత్తుపదార్థాలతో కల్తీ చేసిన కల్లే కారణమవుతుండడం గమనార్హం.  

పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు.. 
కామారెడ్డిలో విక్రయిస్తున్న కల్లులో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కల్లు విక్రయాలు పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి హైడోస్‌ కల్లును సేవిస్తూ ఎంతో మంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారు ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే కల్తీ కల్లు విక్రయాలను అడ్డుకోవడం లేదని తెలుస్తోంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా