ప్రభుత్వ భూమికి ఎసరు..!

2 Mar, 2020 11:00 IST|Sakshi

చౌటుప్పల్‌లోని గాంధీపార్క్‌ స్థలంపై అక్రమార్కుల కన్ను

రాత్రికి రాత్రే హద్దురాళ్లు పాతిన గుర్తు తెలియని వ్యక్తులు

భూమి విలు రూ.3కోట్ల పైనే!

చౌటుప్పల్‌ (మునుగోడు) : మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీపార్క్‌ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన దొరవారు పంతంగి శ్రీనివాస్‌రావు ఈ భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చారు. సుమారు 0–35 ఎకరాల వరకు ఉన్న ఈ స్థలం మొన్నటి వరకు కంపచెట్లు, చెత్తాచెదరంతో ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాంధీపార్క్‌ను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 29వ తేదీ వరకు పనులు జరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఆక్రమణలు జరిగినప్పటికీ అప్పటి నుండి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.

హద్దురాళ్లు నాటిన గుర్తు తెలియని వ్యక్తులు 

కానీ, సోమవారం తెల్లవారే వరకు గాంధీపార్క్‌ స్థలంలో హద్దురాళ్లు వెలిశాయి. ఊర కృష్ణమూర్తి ఇంటి పక్క నుంచి ప్రధాన మురికి కాల్వ వైపునకు రూ.3కోట్లకు పైనే విలువ చేసే 500 గజాల స్థలానికి రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు నాటారు. ఉదయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై  మున్సిపల్‌ కమిషనర్‌ మందడి రామదుర్గారెడ్డిని సంప్రదించగా హద్దు రాళ్లు నాటిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తొలగిస్తామని తెలిపారు. హద్దురాళ్లు నాటిన వ్యక్తుల వివరాలు తెలియలేదన్నారు.

మరిన్ని వార్తలు