జీఎస్టీతో జీరో దందా!

10 Dec, 2017 02:45 IST|Sakshi
ఇటీవల పన్నుల శాఖ అధికారులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ అక్రమ రవాణా వాహనాలు

రాష్ట్ర మార్కెట్లోకి భారీగా ఇతర రాష్ట్రాల సరుకులు.. బిల్లులేమీ లేకుండానే దిగుమతి

టైల్స్, టెక్స్‌టైల్స్‌ నుంచి నిత్యావసరాల దాకా..

గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, రాజస్తాన్‌ల నుంచి రవాణా

ట్రావెల్‌ బస్సుల్లో గోవా నుంచి గుట్కాలు

ఢిల్లీ చాందినీ మార్కెట్‌ నుంచి చైనా సరుకులు

మన రాష్ట్రం నుంచి బెంగళూరుకు భారీగా ఐరన్‌ ఉత్పత్తులు

ఇటీవల దాడుల్లో పట్టుబడింది కూడా ఈ రాష్ట్రాల సరుకులే

జీఎస్టీ నేపథ్యంలో సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల ఎత్తివేత ఎఫెక్ట్‌

ప్రత్యేక తనిఖీలు చేపడితేనే అక్రమాలు ఆగేందుకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడం, చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో బ్లాక్‌ మార్కెట్‌ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరుకులు రాష్ట్ర మార్కెట్‌లోకి వస్తున్నాయి. పన్ను ప్రసక్తే లేకుండా పెద్ద ఎత్తున జీరో దందా సాగుతోంది. ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లలో చిల్లు పడుతోంది. దాదాపు ఆరు నెలలుగా జరుగుతున్న ఈ తంతు అక్టోబర్‌ నుంచి ఊపందుకుందని.. దీంతో పన్నులశాఖ దాడులకు ఉపక్రమించిందని చర్చ జరుగుతోంది.

అడ్డదారులు.. అనేక మార్గాలు
వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా సరుకుల బ్లాక్‌మార్కెట్, జీరో దందా ఎప్పుడూ ఉండేదే. కానీ జీఎస్టీ నేపథ్యంలో పన్నుల శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇది విచ్చలవిడిగా మారింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు గుజరాత్, కేరళ, రాజస్థాన్‌ల నుంచి చాలా రకాల సరుకులు ఎలాంటి బిల్లులు లేకుండానే రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి.

ముఖ్యంగా గుజరాత్‌ రాష్ట్రం నుంచి టైల్స్, టైక్స్‌టైల్స్‌.. గుజరాత్‌లోని ఉంజా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి జీలకర్ర, జీడిపప్పు, ధనియాలు, ఖర్జూర లాంటి వస్తువులు.. రాజస్థాన్‌ నుంచి గ్రానైట్, మార్బుల్స్, హ్యాండ్‌లూమ్స్‌ వంటివి రాష్ట్రంలోని బ్లాక్‌మార్కెట్‌కు వెల్లువలా వస్తున్నాయి. కేరళ నుంచి ప్‌లైవుడ్, టింబర్‌... గోవా నుంచి ట్రావెల్‌ బస్సుల్లో గుట్కాలు, ఢిల్లీ చాందినీ మార్కెట్‌ నుంచి చైనా వస్తువులు, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ పరికరాలు, ప్లగ్గులు, స్విచ్‌లు, వైర్లు, ఫ్యూజ్‌లు ఇక్కడి మార్కెట్లోకి పెద్ద మొత్తంలో వస్తున్నాయి.

నిత్యావసరాలు కూడా..
నిత్యావసరాలైన కందిపప్పు, శనగలు, గోధుమ పిండి, మైదా, రవ్వ వంటి సరుకులు కూడా బిల్లుల్లేకుండానే వందల టన్నులు వస్తున్నాయని.. ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సీజన్‌ను బట్టి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పంచదార పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వస్తోందని పన్నుల శాఖ అధికారులే చెబుతున్నారు. ఇదంతా పన్నుల శాఖ అధికారులకు తెలియనిదేమీ కాదని.. ఉన్నతాధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బ్లాక్‌ మార్కెట్‌ వ్యవహారం శ్రుతి మించడంతో అధికారులు ఇటీవల రెండుసార్లు దాడులు చేశారని.. స్పెషల్‌ డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఈ దాడుల్లో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సరుకులే ఎక్కువగా పట్టుబడ్డాయని చెబుతున్నారు.

మన దగ్గరి నుంచి కూడా..
మన రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఐరన్‌ ఉత్పత్తులు బిల్లులు లేకుండా వెళ్లిపోతున్నాయి. బళ్లారి నుంచి వచ్చే ముడిసరుకుతో శంషాబాద్, షాద్‌నగర్‌లలో ఐరన్‌ ఉత్పత్తులను తయారుచేసి బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇలా కనీసం రోజుకు 50 లారీల ఐరన్‌ ఉత్పత్తులు ఎలాంటి బిల్లులు లేకుండా, పన్ను కట్టకుండా ఇతర రాష్ట్రాలకు వెళుతున్నట్టు అంచనా. ట్రాన్స్‌పోర్టర్లు, డీలర్లు కుమ్మక్కై పెద్ద ఎత్తున సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం బ్లాక్‌ మార్కెట్‌ సమస్య పెరుగుతోంది.

స్పెషల్‌ డ్రైవ్‌లు సరేగానీ..
దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న జీరో దందాతో రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం జరిగిన తర్వాత మేల్కొన్న పన్నుల శాఖ అధికారులు... ఈనెల ఏడో తేదీన పెద్ద ఎత్తున దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 బృందాలుగా ఏర్పడి 2 వేలకు పైగా వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో ఎలాంటి బిల్లులు లేకుండా 126 వాహనాల్లో రవాణా అవుతున్న సరుకులను సీజ్‌ చేసి.. రూ. 1.25 కోట్లు జరిమానా విధించారు. అంతకు ముందు హైదరాబాద్‌లో దాడులు చేసి రూ. 34 లక్షలు జరిమానా వసూలు చేశారు. అయితే ఈ దాడులను మరింత విస్తృతం చేయాల్సి ఉందని, అప్పుడు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 12 బృందాలకు షెడ్యూల్‌ ఇచ్చి.. తగిన శిక్షణ అందించి తనిఖీలు చేపట్టాలని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు