భూగర్భ ఘోష

22 Feb, 2016 02:19 IST|Sakshi
భూగర్భ ఘోష

సరి‘హద్దులు’ దాటిన దందా
పట్టా భూమి ఒడ్డున ఉంటే.. గోదావరిలో ఇసుక తవ్వకాలు
నిబంధనలను నదిలోతొక్కుతున్న ఇసుకాసురులు
నిత్యం 150 వాహనాల్లో రవాణారోజుకు లక్షలు దండు కుంటున్న అక్రమార్కులు
టీఎస్‌ఎండీసీ పేరుతోకాంట్రాక్టర్లకు కాసులు
 

 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :చెన్నూరు వద్ద గోదావరిలో సాగుతున్న ఇసుక దందా సరి‘హద్దులు’ దాటిందా? పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు నదిలో ఉన్నట్లు చూపి తవ్వకాలకు తలుపులు బార్లా తీశారా? ఈ క్రమంలో రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయా? అంటే అవుననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టా భూములు ఒక చోట ఉంటే, బడా ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు ఆ భూములు నదిలో ఉన్నట్లు తేల్చి ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చెన్నూరు గ్రామ శివారులోని సర్వే నెం.230లో 1.12 ఎకరాల్లో 12 వేల క్యూబిక్ మీటర్లు, 227, 227/1లోని 29 గుంటల్లో 6,750 క్యూబిక్ మీటర్లు, అలాగే సర్వే నెం.231లోని 2.19 ఎకరాల్లో మరో 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు అధికారులు డిసెంబర్‌లో అనుమతులు కట్టబెట్టిన విషయం విధితమే.
 
 ఆదిలాబాద్ :జిల్లాలో ఒకవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే విధంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాగా.. ఈ అనుమతుల పేరుతో చేపడుతున్న ఇసుక దందా ఇప్పుడు మూడు టిప్పర్లు.. ఆరు లారీలు అన్న చందంగా నడుస్తోంది. నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల వరకు భారీ వాహనాల్లో ఇసుకను తరలించి రూ.లక్షలు గడిస్తుంటే, అధికార యంత్రాంగం మామూళ్లతో జేబులు నింపుకుంటోంది. అయితే.. ఈ పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు మాత్రం నదిలో ఉన్నట్లు తేల్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలే చోటు చేసుకున్నాయి. జైపూర్ మండల పరిధిలో కూడా పట్టా భూముల పేరుతోనే నది గర్భాన్నంతా తొలిచేసే వరకు రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని కళ్లు మూసుకున్న అధికారులు, అంతా అయ్యాక విచారణల పేరుతో హడావుడి చేయడం జిల్లాలో పరిపాటిగా తయారైంది.

 నిత్యం రూ.లక్షల్లో...
నగరాల్లో ఇసుక ఇప్పుడు బంగారమైంది. ఒక్కో టన్నుకు రూ.వేలల్లో ధర పలుకుతోంది. ఈ ఇసుక రీచ్ నుంచి నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల లారీల్లో ఇసుక తరలిపోతోంది. ఒక్కో లారీలో 15 నుంచి 20 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు  తరలించి నిత్యం రూ.లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు.

నిబంధనలు నదిలో తొక్కుతున్నారిలా..
ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పూర్తిగా నదిలో తొక్కుతున్నారు. జీవనదిగా పేరున్న గోదావరిని భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. పేరుకు టీఎస్‌ఎండీసీ అయినప్పటికీ, బడా ఇసుక కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించకూడదు. కూలీల చేత ఇసుకను తవ్వించి, డంప్ యార్డుకు తరలించి అక్కడి నుంచి ఇసుకను తరలించాలి. డంప్ యార్డుల్లో ఇసుక లోడ్ చేసేందుకు యంత్రాలను వాడవచ్చు. కానీ.. ఇక్కడ భారీ యంత్రాలతో నది గర్భాన్ని తొలిచేస్తున్నారు. జేసీబీలు, ప్రొక్లయినర్లతో ఇసుకను తోడేస్తున్నారు.నిర్ణీత లోతుకు మించి ఇసుక తవ్వరాదు. కానీ.. భూమి కనిపించే వరకు తవ్వుతుండటంతో నదిలో లోతైన గోతులు ఏర్పడుతున్నాయి. గతంలో ఈ గోతుల్లో పడి స్థానికులు చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇసుక తవ్వకాలు జరుపుతున్న చోట్ల టీఎస్‌ఎండీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ.. అవేవీ లేకుండానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అటువైపు కన్నెత్తి చూస్తున్న నాథుడే లేకుండా పోవడంతో ఇష్టారాజ్యం కొనసాగుతోంది.రాత్రి ఆరు గంటల తర్వాత ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. కానీ.. పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.ఈ ఇసుక రవాణా చేసేందుకు పర్మిట్లు మంజూరు గనుల శాఖకు ఉండేది. కానీ.. టీఎస్‌ఎండీసీకి లీజుకిచ్చాక.. పర్మిట్ల మంజూరు కూడా ఆ సంస్థే జారీ చేస్తోంది. దీంతో ఒక్కో వే బిల్లుపై పదుల సంఖ్యలో భారీ వాహనాలు రవాణా అవుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ఒక్కో వాహనంలో పరిమితికి మించి ఇసుకను రవాణా చేస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఈ లారీలను తనిఖీ చేసిన దాఖలాల్లేవంటే రవాణా శాఖకు కూడా ఏ స్థాయిలో ముడుపులందుతున్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

మరిన్ని వార్తలు