వాగు దాటుతున్న ఇసుక!

4 Aug, 2014 00:31 IST|Sakshi

చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల డివిజన్ పరిధిలోని షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల నుంచి ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్‌సాగర్, గండిపేటల్లోకి నీరు చేరుతుంది. వర్షాలు కురిసి వాగులు ప్రవహించినప్పుడు ఇసుక కూడా భారీగా వచ్చి చేరుతుంటుంది. ఇసుక అధికంగా ఉన్నచోట భూగర్భజలాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

వర్షాకాలంలో మూసీ, ఈసీ వాగులు నాలుగైదు సార్లు నిండుగా ప్రవహిస్తే వేసవిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. సాగుతాగు నీటికి ఇబ్బంది ఉండదు. కాగా.. కొందరు అక్రమార్కులు ఈసీ, మూసీ వాగుల నుంచి తమ ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. నిత్యం వందలాది  ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను వాగు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తరలింపుతో వాగుల్లో గుంతలు ఏర్పడి వర్షం కురిసినప్పుడు భూగర్భంలోకి నీరు ఇంకకుండా దిగువకు ప్రవహిస్తుంటుంది. అక్రమార్కుల ఇసుక వ్యాపారంతో జలసిరి పాతాళంలోకి పోతోంది.

 సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు..
 ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్న షాబాద్ మండలంలోని నాగరగూడ, రుద్రారం,  తాళ్లపల్లి, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, అమ్డాపూర్, చిన్నమంగళారం, వెంకటాపూర్, అప్పోజీగూడ, మోత్కుపల్లి, శంకర్‌పల్లి మండలంలోని రావులపల్లి,  పొద్దటూరు, ఫత్తేపూర్, మోకిల, టంగటూరు, గోపులారం, ఎల్వర్తి, జన్వాడ, తదితర గ్రామాల సమీపంలోంచి అక్రమార్కులు ఇసుక తరలిస్తున్నారు.

నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1800-2200 వరకు దండుకుంటున్నారు. వాగుల్లో ప్రవాహం లేనప్పుడు అక్రమార్కులు ఇసుకను తరలించి డంప్ చేసుకుంటున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 వాల్టా చట్టానికి తూట్లు..
 ఇసుకను అక్రమంగా తరలిస్తే అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని వాల్టా చట్టం చెబుతోంది. ప్రభుత్వ అవసరాలకు మాత్రం సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని ఇసుక తరలించుకోవచ్చు. దీంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అధికారులు పర్మిట్లు జారీచేశారు. ఇదే అదనుగా అక్రమార్కులు అవసరానికి మించి ఇసుకను తరలించి డంప్ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు