మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి

23 Oct, 2018 10:33 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌

వరంగల్‌ రూరల్‌: రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌  వెలువడినందున అక్రమ మద్యం, బెల్లం,గుడుంబా అమ్మకాలను నియంత్రించాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం సాయంత్రం వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఐఎంఎఫ్‌ఎల్, ఐడీసీ, అక్రమ తరలింపులను అడ్డుకోవాలని సురేష్‌ రాథోడ్‌ చెప్పారు. ప్రతి వైన్స్‌షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పనిచేసేలా చూడాలని ఆయన తెలి పారు.

స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్‌1, ఆర్‌2, రిజిష్టర్లను నిర్వహించాలని తెలిపా రు. ఎక్కువ మద్యం అమ్మితే ఆ రిటేల్‌ షాపుల వివరాలు తమకు ఇవ్వాలని సురేష్‌ రాథోడ్‌ వివరించారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు వాట్సప్‌ గ్రూపునకు అందుబాటులో ఉండాలని చెప్పారు. సెల్‌ మెసేజ్‌లకు స్పందించాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలకు అరగంటలోపే స్పందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు అడగవద్దని ఆయన స్పష్టం చేశారు.

సి–విజిల్‌ ఫిర్యాదులకు స్పందించాలని ఆయన తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరినైనా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించినప్పుడు కొట్టకూడదని సురేష్‌ రాథోడ్‌ అన్నారు. 24 గంటలు పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో  జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు వరంగల్‌ రూరల్‌ పి.శ్రీనివాసరావు, వరంగల్‌ అర్బన్‌ బాలస్వామి, మహబూబాబాద్‌ డీపీఈఓ దశరథ్, భూపాలపల్లి డీపీఈఓ శశిధర్‌రెడ్డి, జనగామ డీపీఈఓ మహిపాల్‌ రెడ్డి, సీఐలు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు