కూల్‌ కిల్లర్‌..

23 Apr, 2018 13:20 IST|Sakshi
బాక్సులో తయారవుతున్న ఐస్‌

చల్లదనం కోసం తీసుకునే ఐస్‌తో అంతా హానికరమే..

పారిశ్రామిక అవసరాలకు వాడే ఐస్‌లో పానీయాల తయారీ

జిల్లాలో ఎక్కడా కనబడని ఎడిబుల్‌ ఐస్‌ ప్లాంట్‌లు

మనం వాడే ఐస్‌లో బ్యాక్టీరియా, వైరస్‌లు

ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.. పట్టించుకోని యంత్రాంగం

దురాజ్‌పల్లి (సూర్యాపేట) :ఎండాకాలంలో ప్రజలంతా చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్, క్యూలర్, ఏసీలను వినియోగించక తప్పడం లేదు. భయటకు వెలితే నీడ కోసం వెతుకులాడుతుంటారు. ఈ సమయంలో ముఖ్యంగా ప్రజలకు చల్లటి నీరు, పానీయాలు తాగుతుంటారు. అయితే చల్లని పానీయాల కోసం వ్యాపారులు ఐస్‌ వాడుతారనేది అందరికీ తెలిసిన విషయమే.. రోడ్లపై ఉన్న బండ్ల దగ్గర నుంచి దుకాణాల వరకు అందరు ఐస్‌ ముక్కలను ఉపయోగించి పానీ యాలు తయారుచేస్తుంటారు. వాటిని మనం తాగేస్తుంటాము కానీ.. అందులో వాడుతున్న ఐస్‌ ఎంతమాత్రం నాణ్యమైనదని ఆలోచించం. ఈ ఐస్‌ ఏ మాత్రం నాణ్యమైనది కాదని, ప్రజలు అనారోగ్యం బారిన పడేలా చేస్తోందని వైద్యులు, నిపుణులు అంటున్నారు.

అవగాహన లేక..
ప్రజలకు సరైన అవగాహన లేక ఆర్యోగానికి ప్రమాదకరమైన ఐస్‌ కలిపిన శీతల పానీయాలు తాగి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఐస్‌ నాణ్యమైనది కాదని వ్యాపారులకు కూడా తెలిసే వాడుతున్నారు. ప్రజల ఆర్యోగాలతో వారికి పని లేదు తమ వ్యాపారాలు నడిస్తే చాలు. సాధారణగా పండ్ల రసాలు ఆర్యోగానికి చాలా మంచివి. కాని అందులో కలిపే ఐస్‌తో మొత్తం ప్రమాదం పొంచి ఉన్నది. సాధారణంగా శీతల పానీయాలలో ఎడిబుల్‌ ఐస్‌ ప్లాంట్లలో తయారైన ఐస్‌ను మాత్రమే వాడాలి. కాని జిల్లాలో ఎక్కడా ఎడిబుల్‌ ఐస్‌ ప్లాంట్‌లు లేవు. ఉన్నవన్నీ పారిశ్రామిక అవసరాల కోసం ఐస్‌ తయారు చేసే ప్లాంట్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ ఐస్‌ కేవలం చేపలు, రొయ్యలు, మృతదేహాలు నిల్వ చేయడం కోసమే వాడాలి.

ఐస్‌ కలిపిన పానీయాలు తాగితే అంతే..
ఐస్‌ తయారీ బ్లాకులలో వాడే ఉప్పు నీరు చాలా కాలం పాటు ప్లాంట్‌లో కదలకుండా ఉండిపోతుంది. ఈ నీటిలో ప్రమాదకరం బ్యాక్టీరియాలు ఉంటాయి. అందరూ ఐస్‌లో బ్యాక్టీరియా ఉండదని భావిస్తారు. కాని అది నిజం కాదు. నీరు గడ్డ కట్టినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు నిద్రావస్థలోనికి వెలుతాయి. సాధారణ ఉష్ణోగ్రత  రాగానే అవి తమ జీవన ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తాయి. ఐస్‌ ప్యాక్టరీలలో ఎటువంటి సురక్షిత విధానాలు పాటించరు. అందువల్ల ఐస్‌లో కొల్లి బ్యాక్టీరియా, రోటా, హెపటైటిస్‌ వంటి వైరస్‌లు ఉంటాయి. ఇలాంటి ఐస్‌ కలిపిన పానీయాలు తాగితే జలుబు, దగ్గు, కామెర్లు, విరేచనాలు వంటి జబ్బులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో నీటిని ఉంచుకొని తాగడమే మేలు.

రోజూ రూ.75వేల వ్యాపారం
జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి, హుజూర్‌నగర్‌ వంటి ప్రధాన పట్టణాలలో పారిశ్రామిక, సాధారణ అవసరాలకు వినియోగించే ఐస్‌ ఫ్యాక్టరీలు సుమారు 15వరకు ఉన్నాయి. వీటిలో జిల్లా కేంద్రంతో పాటు కోదాడలో ఉన్న ఐస్‌ఫ్యాక్టరీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రోజు సుమారు రూ.5వేల నుంచి ఏడు వేల వరకు వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. సరాసరి రోజుకు రూ.5వేల చొప్పున బేరం జరిగితే రూ.75వేల ఠివరకు ఐస్‌ను అమ్ముతున్నట్టు తెలుస్తోంది. నెలకు రూ.22.50లక్షల వ్యాపారం చేస్తున్నారు. అలాగే జిల్లాలో పండ్ల రసాలను, నిమ్మ సోడాలను ఇతర పదార్థాలను ఐస్‌ వేసి అమ్మే వ్యాపారులు సుమారు 700పైనే ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా సూర్యాపేట, కోదాడలో 500 వరకు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వ్యాపారం నడుస్తోంది.  ఈ నేపథ్యంలో ఒక్క ఐస్‌ సాధారణ బాక్స్‌ సుమారు పది కేజీలు రూ.100పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

అత్యంత ప్రమాదకరం..!
పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేసిన ఐస్‌ను ప్రజలు నేరుగా తీసుకోకూడదు. కాని వ్యాపారులు తమ అవసరాకోసం ఈ ఐస్‌నే వాడుతున్నారు. చెరుకు రసం, లస్సీ, ఫ్రూట్‌ జ్యూస్‌లు, నిమ్మరసం, షోడా, సుగంధ పానీయాల తయారీలో ఈ ఐస్‌ను వాడుతున్నారు. ఈ ఐస్‌ అతి సాధారణమైన నీటితో తయారు చేస్తారు. అంతే కాకుండా ఈ ఐస్‌ తయారి సమయంలో ఐస్‌  బ్యాకులు ఉప్పు నీటిలో మునిగి ఉంటాయి. ఉప్పునీరు తీసుకున్న చల్లదానాన్ని ఈ బ్లాక్‌ గ్రహించి దీనిలో దీనిలో ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తున్నది. కొన్ని సందర్భలాలో ఉప్పు నీరు బ్లాక్‌లోకి నేరుగా చేరుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంమైనది.

మరిన్ని వార్తలు