ముందుగానే నైరుతి

29 May, 2017 03:21 IST|Sakshi
ముందుగానే నైరుతి

నేడు లేదా రేపు కేరళలో ప్రవేశించనున్న రుతుపవనాలు
► బంగాళాఖాతంపై అల్పపీడనమే కారణం
► కొద్దిరోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం
►  అల్పపీడనం తుపానుగా మారనుందన్న వాతావరణ శాఖ
► రాష్ట్రంపై మాత్రం దాని ప్రభావం ఉండదని వెల్లడి
► రాష్ట్రవ్యాప్తంగా కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలు


సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అంచనా వేసినదానికన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయని భారత వాతా వరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ నెల 30, 31వ తేదీల్లోనే కేరళలో ప్రవేశిస్తాయని తెలిపింది. తర్వాత రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణ సహా దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరించే అవకాశముందని వెల్లడించింది. ఇక పశ్చిమ మధ్య, దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలను కలుపుతూ తూర్పు బంగాళా ఖాతంలో వృద్ధిచెందిన అల్పపీడనం మరింత ఉధృతమై తుపానుగా మారే అవకాశముం దని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేశ్‌ వివరాలు వెల్లడించారు.

బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాలు మరింత ముందుగా రావడానికి తోడ్పడుతోందని చెప్పారు. వచ్చే 24 గంటల్లో కేరళ, మాల్దీవు లు, దక్షిణ అరేబియా సముద్రం, బంగాళా ఖాతంపైకి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం రాత్రికి మరింత ఉధృతమై తుపానుగా మారే అవకాశ ముందని.. మంగళవారం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో తీరం దాటవచ్చని చెప్పారు. దాని కారణంగా బంగ్లాదేశ్‌తోపాటు ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

తగ్గిన ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబా ద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడినా దాని ప్రభావం తెలంగాణపై ఉండదని.. ఇవి సాధా రణ వర్షాలేనని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి చెప్పారు. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చాలా చోట్ల కొద్దిరోజులుగా 45–46 డిగ్రీల మధ్య నమోదై న ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి.

ఆదివారం గరిష్టంగా రామగుండంలో 43 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. ఠారెత్తిస్తున్న ఎండలతో సతమతమైన హైదరాబాద్‌లో ఆదివారం 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హకీంపేటలో 39, ఖమ్మంలో 38, భద్రాచలంలో 36 డిగ్రీలుగా నమోదైంది. ఇక గత 24 గంటల్లో వరంగల్‌ జిల్లా శాయంపేట, ఆత్మకూరు, రంగారెడ్డి జిల్లా మంచాల్‌లలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో 3, నిర్మల్, కొడంగల్, యాచారం, కొందుర్గుతోపాటు మరిన్ని చోట్ల 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు