ఈసారి భగభగలే!

2 Mar, 2019 03:05 IST|Sakshi

గతేడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

2016 నాటి పరిస్థితి పునరావృతమవుతుందని అంచనా

కొన్ని చోట్ల 47–49 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్‌

రాజస్తాన్, యూపీల నుంచి వడగాడ్పులు

మొదలైన వేసవి వేడి.. మే నెలాఖరుకు భారీగా ఎండలు

వడగాడ్పుల జోన్‌లో తెలంగాణ ఉండటంపై ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: సీజన్‌ ప్రకారం మార్చి ఒకటో తేదీ (శుక్రవారం) నుంచి వేసవి ప్రారంభమైంది. జూన్‌ ఒకటో తేదీ వరకు ఎండాకాలం కొనసాగనుంది. కానీ పదిరోజుల కింది నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించుకునేందుకే భయమేస్తోంది. రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతోపాటుగా దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్‌ జోన్‌లో తెలంగాణ ఉండటంతో ఈసారి ఇక్కడ భానుడి భగభగలు తప్పవని స్పష్టమైంది.

రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గతేడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. ఈ మార్పులు, సూచనలతో ప్రభు త్వం కూడా వేసవి కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

మూడు నెలల్లో 20 రోజులపాటు వడగాడ్పులే
వేసవిలో ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉంటే ఆ వాతావరణ పరిస్థితిని ‘వడగాడ్పులు’అంటారు. సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. 47 డిగ్రీల వరకు చేరుకుంటే తీవ్రమైన వడగాడ్పులనే అంటారు. ఇలాంటి పరిస్థితి.. తెలంగాణలో వచ్చే మూడు నెలల్లో 20 రోజుల వరకు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాడ్పులు వచ్చే పరిస్థితిని వాతావరణ శాఖ ముందే గుర్తించగలదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కుదురుతుంది. 2016 సంవత్సరం వేసవిలో ఏకంగా 27 రోజులు వడగాడ్పులు తెలంగాణలో నమోదయ్యాయి. వడగాడ్పులతో గతంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన సంగతి తెలిసింది.

2015లో అత్యధికంగా 541 మంది వడదెబ్బతో చనిపోయారు. ఇక ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా గాలిలో తేమ శాతం పెరిగితే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత 34 డిగ్రీలున్నా.. వాతావరణంలో తేమ 75% ఉంటే.. అది సాధారణంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా ఉండి.. తేమ 100% ఉంటే అది కూడా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. కనుక ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ శాతాన్ని బట్టి కూడా తీవ్రతలో హెచ్చుతగ్గులుంటాయి.  

ఎండలు తీవ్రంగా ఉంటే రెడ్‌ అలర్ట్‌
వాతావరణశాఖ ఎండల తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్‌ అలర్ట్‌ జారీచేస్తారు. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో (హీట్‌వేవ్‌ వార్నింగ్‌) అలర్ట్‌ ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వైట్‌ అలర్ట్‌ జారీచేస్తారు.

ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
1971 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వైకే రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి ఒకటో తేదీ నుంచి సమ్మర్‌ క్యాలెండర్‌ ఇయర్‌ ప్రారంభం అవుతుందన్నారు. ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు ప్రతిఏటా కంటే ఈ ఏడాది కొంచెం ఎక్కువ ఉంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అధికంగా ఉంటాయన్నారు. గతేడాది కంటే అధికంగా నమోదవుతాయన్నారు. 2010లో వడగాడ్పుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై చాలా తీవ్రంగా ఉందన్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బ మరణాలు 720కి పైగా నమోదు అయ్యాయని గుర్తుచేశారు. 2015 తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ప్రాంతంలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైనే నమోదైందన్నారు.  – వైకే రెడ్డి, డైరెక్టర్, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

మరిన్ని వార్తలు