‘బాబు, కుటుంబసభ్యుల కంపెనీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించండి’ 

22 Nov, 2018 05:18 IST|Sakshi

20 కంపెనీలు పెట్టి పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేశారు 

ఆర్వోసీకి న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల విషయంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు బుధవారం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ)కి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణిలు హెరిటేజ్‌తో పాటు మరో 20 కంపెనీలకు సంబంధించి పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేశారని, దీంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ ఆగ్రో మెరైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ న్యూట్రివెట్‌ లిమిటెడ్, నిర్వాణ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ ప్యాకేజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ కాన్‌ప్రో లిమిటెడ్, నిర్వాణ లాజిస్టిక్స్‌ అండ్‌ వేర్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రెడ్‌హిల్స్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ వేర్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మెగాబిడ్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ల గురించి ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఇవన్నీ షెల్‌ కంపెనీలేనని పేర్కొన్నారు. కంపెనీల చట్టం కింద నిపుణుల బృందం రంగంలోకి దిగి తే తప్ప మనీ ల్యాండరింగ్‌ కింద జరిగిన నేరాలు బహిర్గతం కావన్నారు. కేంద్రం అన్ని  చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నేరస్తులు కంటికి కనిపించని నేరాలు చేస్తూ తప్పించుకుంటున్నారన్నారు. సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) అధికారులు  ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పై కంపెనీల యాజమాన్యాలు, ఆస్తి, అప్పుల పట్టీ లు, వార్షిక నివేదికలు తదితర వాటిని లోతుగా పరిశీలించడంతో పాటుగా ఈ కంపెనీల వ్యవహారంపై ఎస్‌ఎఫ్‌ఐఓతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.   

మరిన్ని వార్తలు