ఎక్కడి చెత్త అక్కడే..

9 Jul, 2015 23:30 IST|Sakshi

కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
 
 పరిగి : పంచాయతీ కార్మికుల సమ్మెతో పరిగి పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్తా చెదారం పేరుకుపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పరిసరాలు, రోడ్లు, మురికికాలువలు, చెత్త కుండీలు పరిశుభ్రంగా ఉంచే పంచాయితీ కార్మికులు సమ్మె బాటపట్టడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. పట్టణంలో ఉన్న చెత్తకుండీలు పూర్తిగా నిండిపోయాయి. టీచ ర్స్ కాలనీకి వెళ్లే దారిలో, బస్టాండ్ ముందు, కూరగాయాలు విక్రయించే రోడ్ల పై చెత్తకుప్పలు పేరుకుపోయాయి. పరిసరాలు దుర్గంధంతో నిండిపోయాయి. కార్మికులు సమస్యను పరిష్కరించటంలో పాలకులు చిత్తశుద్ధి చూపటం లేదు. ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపించటంలేదు. గ్రామాల్లో నీళ్లు వదలడం, వీధిలై ట్లు ఆన్, ఆఫ్ చేయడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో తాత్కాలి కంగా పనులను వేరేవారికి అప్పగించిన పాపాన పోవడంలేదు. సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 పేరుకుపోయిన కుప్పలు
  ఇబ్రహీంపట్నం: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ‘పట్నం’ నగర పంచాయతీలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. అంబేద్కర్ చౌ రస్తా సమీపంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతం, పెట్రోల్‌బంక్ ప్రాంతం, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి సమీపంలో, పోచమ్మబస్తీ, రాయ్‌పోల్ రోడ్డులోని పాత పోలీస్‌స్టేషన్ ప్రాంతం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి.  తీవ్ర దుర్గంధంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య ఇలాగే ఉంటే.. అంటురోగాలు, విషజ్వరాలు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 పడకేసిన పారిశుద్ధ్యం
  తాండూరు: కాంట్రాక్టు కార్మికులు సమ్మె బాట పట్టడంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. నాలుగు రోజులుగా కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో తాండూరు మున్సిపాలిటీలో కాలనీలు, వార్డులు కంపుకొడుతున్నాయి. చెత్తకుప్పలు ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో భరించలేని దుర్గంధంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు.  అధికారులు, పాలక మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించకపోవడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడంతో దోమల బాధ తీవ్రమైంది. ఇక కాలనీలు, వార్డుల్లో వ్యర్థపదార్థాలు, చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ స్తంభించింది. నాలుగు రోజులుగా సుమారు 160 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది.  కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లతో అధికారులు, పాలకమండలి చెత్తను ఎందుకు తొలగించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రోజులు ఈ ‘కంపు’ భరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు