సామ్రాజ్యవాదం, మతోన్మాదం ఒక్కటయ్యాయి

14 Mar, 2015 01:11 IST|Sakshi
సామ్రాజ్యవాదం, మతోన్మాదం ఒక్కటయ్యాయి
  • ఐఎఫ్‌టీయూ బహిరంగ సభలో ప్రొ.హరగోపాల్
  • సాక్షి, హైదరాబాద్: ప్రపంచీకరణ పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలను దోపి డీ చేస్తున్న సామ్రాజ్యవా దం, మనదేశంలోని మతోన్మాదం ఒక్కటై దేశానికి  ప్రమాదకర పరిస్థితులను తీసుకొచ్చాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. పౌరుల హక్కులను సంరక్షించాల్సిన మన పాలకులు విదేశీయులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

    అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శుక్రవారం కార్మికుల బహిరంగ సభ జరిగింది. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ప్రొ.హరగోపాల్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షుడు డీవీ కృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య ప్రసంగించారు.

    ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం మన దేశ సంపదను ఆంగ్లేయులు ఎలా దోచుకున్నారో, ప్రపంచీకరణ, సరళీకరణ పేర్లతో విదేశీ పెట్టుబడులను మన దేశానికి తీసుకొచ్చి మన సంపదనంతా తరలించేందుకు సామ్రాజ్యవాద దేశాలు కుట్ర పన్నుతున్నాయని అరోపించారు.

    మన పాలకులు సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ధ్వజమెత్తారు. పౌరుల జీవన ప్రమాణాలను పెంచాల్సిన కేంద్ర పాలక వర్గం దేశంలో మతకల్లోలం సృష్టిస్తూ, మతమార్పిడులు చేస్తోందని ఆరోపించారు. సంపన్నులకు కోట్లలో రాయితీలు ఇస్తున్న పాలకులు.. పేదవాడికి కనీస అవసరాలను తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఆహార భద్రత, సంక్షేమం, విద్య, ఆరోగ్యం తదితర ప్రజలకు అసరమయ్యే రంగాలకు బడ్జెట్‌లో నిధులు తగ్గించడంలో అర్థమేంటని ప్రశ్నిం చారు.

    కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, ఉపాధ్యక్షుడు జే శ్రీనివాస్, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గాదె ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు సుందరయ్య పార్కు నుంచి వేలాది మంది కార్మికులు ర్యాలీగా ఇందిరా పార్కుకు తరలివచ్చారు.

మరిన్ని వార్తలు