అర్హులందరికీ అందాలి

20 Oct, 2014 23:36 IST|Sakshi
హరీష్‌రావు

సంగారెడ్డి అర్బన్: సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  సంక్షేమ పథకాలకోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు అయోమయంలో ఉన్నారని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. దరఖాస్తు పరిశీలనకు వెళ్లినప్పుడు అధికారులు ఓపికతో వ్యవహరించి ప్రజల సందేహాలను తీర్చాలన్నారు.  

అర్హులై ఉండి కూడా ఇప్పటికీ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోనట్లయితే వచ్చే నెలలో తిరిగి మంజూరు  చేస్తామని ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు.  ఎటువంటి నిబంధనలు విధించకుండా అర్హత గల ప్రతి ఒక్కరికీ నవంబర్ 8 నుంచి పెంచిన పింఛన్లు సర్కార్ మంజూరు చేస్తుందని, ఈ విషయాన్ని అధికారులే ప్రజలకు వివరించాలన్నారు. సంక్షేమ పథకాల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రజలకు సవివరంగా తెలపాలని అధికారులను ఆదేశించారు. కుమారుడు ఉద్యోగి అయినప్పటికీ తల్లి వేరుగా ఉన్నట్లయితే పింఛన్ మంజూరు చేయాలన్నారు. నిరాదరణకు గురైన మహిళల కుటుంబాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. ఓటరు లిస్టులో, ఆధార్ కార్డుల్లో, వయస్సు తప్పుగా నమోదు అయి ఉంటే,  నివేదికలో తగిన రిమార్కులు నమోదుచేసి మంజూరు చేసే అధికారం విచారణ అధికారులకు ఉందన్నారు.

భార్య , భర్తలు చాలా కాలంగా వేరు గ్రామాల్లో జీవిస్తే అటువంటి దరఖాస్తులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పెద్ద కుటుంబాలు విడివిడిగా దరఖాస్తు చేసినట్లయితే ఆహారభద్రత కార్డులు మంజూరు చేయాల్సిందిగా సూచించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా త్వరలోనే సదరెం క్యాంపులు నిర్వహించి వికలాంగులందరికీ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం తగు చర్యలు చేపడుతోందని, ఈ విషయాన్ని అధికారులు గ్రామాల్లో వివరించాలన్నారు. న్యాల్‌కల్ , కల్హేర్ మండలాల్లో చాలా మంది అనర్హులకు బియ్యం, పింఛన్‌లు మంజూరు కాగా, అర్హులకు అన్యాయం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు వాటిపై పరిశీలన జరిపి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, పాపన్నపేట మండలంలో గతంలో చాలామంది అర్హులకు ఆహార భధ్రత కార్డులు, పెన్షన్లు అందలేదని ఈ సారి ప్రతి ఒక్కరికి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, ఆహార భద్రత కార్డులు, పింఛన్ దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందన్నారు. శనివారం నుంచి విచారణ చేపట్టామని మంత్రికి వివరించారు. జిల్లాలో పెన్షన్ మంజూరుకు 3,96,400 దరఖాస్తులు అందాయన్నారు. వీటన్నింటినీ పరిశీలించి నవంబర్ 8వ తేదీ నుంచి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి, శాసన మండలి సభ్యులు భూపాల్‌రెడ్డి, జేసీ శరత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు