పకడ్బందీగా పెసా

12 Jul, 2019 10:37 IST|Sakshi

పెసా చట్టానికి మరింత పదును

ప్రతి సభ నుంచి ఉపాధ్యక్ష, కార్యదర్శల ఎన్నిక

తొలిసారి మూడు జిల్లాలకు పెసా కో ఆర్డినేటర్లు

భవిష్యత్‌లో గిరిజన చట్టాల ప్రకారమే అన్ని పనులు

సాక్షి, ఆసిఫాబాద్‌: అడవి బిడ్డలకు స్వయం పాలన మరింత సులువు కానుంది. ఇన్నా ళ్లు షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనుల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగింది. పెసా (పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా) 1996 చట్టం పకడ్బందీగా అమలు కానున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట పడే ఆస్కారముంది. ఇందుకు ప్రత్యేకంగా ఏజెన్సీ పరిధిలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు తొలిసారిగా పెసా కో ఆర్డినేటర్ల నియామకం జరుగుతోంది. ఏజెన్సీ గ్రామాల్లో గత నాలుగు రోజులుగా పెసా గ్రామసభల నిర్వహణ సాగుతోంది. మరో వారం రోజుల్లో ఏజెన్సీ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని అన్ని గిరిజన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పెసా ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. 

పెసా గ్రామసభలు ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్‌ స్థాయి అధికారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. వీరితో పాటు జిల్లాకు ఒక పెసా కో ఆర్డినేటర్‌ను కొత్తగా నియమించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పెసా కో ఆర్డినేటర్‌గా వెడ్మ బొజ్జు, కుమురం భీం జిల్లా కో ఆర్డినేటర్‌గా అర్క వసంతరావు నియమితులయ్యారు. వీరికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.25వేల జీత భత్యాలతో పాటు వాహన, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే పెసా సభ్యులకు నెలకు రూ.2500 గౌరవ వేతనం అందనుంది. వాస్తవానికి పెసా కో ఆర్డినేటర్ల నియామకం పీవో ఐటీడీఏ, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో 2017లోనే జరిగింది. 2018 ఏప్రిల్‌ నుంచి వారు విధుల్లో చేరారు. కాగా వరుస ఎన్నికలతో గ్రామాల్లో ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోలేకపోయారు.
పెసా గ్రామసభ అంటే.?

దేశంలోని గ్రామాలను సర్వాతోముఖాభివృద్ధి చేసేందుకు భారత పార్లమెంటు 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారానే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు పురుడుపోసుకున్నాయి. అయితే ఈ సవరణ కేవలం మైదాన ప్రాంతంలోని గ్రామాలకే అధికారాలు కల్పించాయి. కాని రాజ్యాంగంలో ఉన్న ఐదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో మరోమారు గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించాలని వారి ప్రాంతాల్లో గిరిజనేతరుల జోక్యం తగ్గించాలనే ఉద్దేశంతో 1996లో పంచాయతీరాజ్‌ ఎక్స్‌టేన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా(పెసా) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చినప్పటికీ నియమనిబంధనలు మాత్రం 2011లో ఉనికిలోకి వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిదేళ్ల అనంతరం ఈఏడాది నుంచి పెసా కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు.  ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాలో విస్తరించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పెసా గ్రామసభలను నిర్వహించేందకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకొనున్నారు. 

మూడు జిల్లాల పరిధిలో..
ఆదిలాబాద్‌లో ఏజెన్సీ విస్తరించి ఉన్న 16 మండల్లాలోని 248 గ్రామ పంచాయతీల్లో 363 రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా 726 ఆవాసాల నుంచి ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. అలాగే మంచిర్యాలలోని ఎనిమిది మండలాల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ పరిధిలో 18 గ్రామ పంచాయతీల్లో 29 గ్రామసభల్లో 75 గిరిజన గూడాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎన్నుకోనున్నారు. ఇక కుమురం భీం జిల్లాలో 13 ఏజెన్సీ మండలాల్లో 168 గ్రామ పంచాయతీల పరిధిలో 204 గ్రామసభల్లో 580 ఆవాసాలకు ఇద్దరేసి చొప్పున ఎన్నుకోనున్నారు. ఈ మూడు జిల్లాల సభ్యులకు జిల్లా స్థాయిలో కో ఆర్డినేటర్లు ఉంటారు. వీరు పెసా చట్టం అమలులో నిర్ణయాత్మకంగా ఉంటారు. 

ఒక్కో గ్రామసభకు ఇద్దరేసి..
ఏజెన్సీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పెసా చట్టం ప్రకారం అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కొత్తగా ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులకు ప్రస్తుతం గ్రామసభల తీర్మానం ద్వారా ఎన్నుకుంటున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాల నుంచి మొత్తం 37 మండలాల్లో 434 షెడ్యూల్‌ పంచాయతీల్లో ఈ ప్రక్రియ జరగనుంది. గ్రామంలో ఉన్న ఓటర్లు గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ తప్పనిసరిగా 1/3 వంతు కోరం ఉండాలి. అప్పుడే తీర్మానాలు ఆమోదింబడతాయి.

స్వయం పాలనకు పునాది.. 
అధికార యంత్రాంగం ఇష్టారీతిన గిరిజనుల హక్కులు కాలరాసిన సందర్భాలు అనేకం. అయితే ఇక నుంచి ఏజెన్సీ పరిధిలోని భూములు, సహజ వనరులు, అటవీ సంపదతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, వారసంతలు, అక్రమ మైనింగ్, భూగర్భ గనులు, సంఘాలు, బెల్టు, వైన్స్, వ్యాపారం, ఇతరత్ర అభివృద్ధి కార్యాక్రమాలన్ని పెసా చట్టం ప్రకారం గ్రామసభల ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్ణీత వ్యవధిలో ఆ శాఖ అధికారిపై చర్యలు తీసుకుంటారు. చట్టం అమలు, గిరిజనులకు అవగాహన తదితర అంశాలను కో ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తారు.

సమర్థవంతంగా అమలు చేస్తాం 
ప్రస్తుతం అన్ని గిరిజన గ్రామాల్లో పెసా చట్టం అనుసరించి గ్రామసభల ద్వారా ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులకు ఎన్నిక జరుగుతోంది. మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఏజెన్సీలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పెసా చట్టం లోబడే ఉండేలా కృషి చేస్తాం. 
– వెడ్మ బొజ్జు, అర్క వసంతరావు, పెసా కో ఆర్డినేటర్లు, కుమురం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు 

మరిన్ని వార్తలు