పేదలకు మెరుగైన వైద్యం

1 Aug, 2015 23:34 IST|Sakshi
పేదలకు మెరుగైన వైద్యం

జిల్లా ఆస్పత్రికి బ్లడ్ కాంపోనెంట్, డయాలసిస్ యూనిట్‌ల మంజూరు
నిరుపేదల రోగులకు వెసులుబాటు
మాతా శిశు సంరక్షణ వార్డు    స్థాయి పెంపు
 

నల్లగొండ టౌన్  : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలో ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. రక్తం నుంచి ప్లెట్‌లేట్‌లను వేరుచేసే ఖరీదైన బ్లక్ కాంపోనెంట్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిర్వహించే డయాలసిస్ యూనిట్‌లు ఆస్పత్రిలో ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు వాటికి అవసరమైన వసతులను కల్పించాలని కోరుతూ ఇటీవల వైద్య విధానపరిషత్ కమిషనర్ జిల్లా ఆస్పత్రి అధికారులను ఆదేశాలు జారీ చేశారు.  బ్లడ్ కాంపోనెంట్ యూనిట్, డయాలసిస్ యూనిట్‌లకు అవసరమైన వసతి, విద్యుత్, నీటి సౌక ర్యం కల్పించాలని పేర్కొన్నారు.

ఇందుకోసం 1500 నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన హాల్‌లను గుర్తించి, ఆధునీకరించడంతో పాటు సెంట్రల్ ఏసీగా ఆదునీకరించి అప్పగిస్తే బ్లడ్ కాంపోనెంట్, డయాలసిస్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పాత భవనంలోని ఎక్స్‌రే యూనిట్ ఎదురుగా ఉన్న హాల్‌లో ఏర్పాటుకు, డయాలసిస్  యూనిట్‌ను ఎమర్జెన్సీ వార్డు పక్కన గల హాల్‌లో ఏర్పాటు చేయాలని గుర్తించిన అధికారులు వాటిని ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు.
 
 
 ఆస్పత్రికి చేరిన బ్లడ్‌కాంపోనెంట్ యూనిట్ మిషనరీ
 బ్లడ్‌కాంపోనెంట్ యూనిట్‌కు అవసరమైన మిషనరీ జిల్లా ఆస్పత్రికి చేరింది. సుమారు రూ.50 లక్షల విలువైన మిషనరీతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో డెంగీ బారిన పడే రోగులకు వెసులుబాటు కానుంది. ప్రస్తుతం జిల్లాలో ప్లెట్‌లెట్‌లను వేరు చేసే బ్లడ్ కాంపోనెంట్ యూనిట్ లేక డెంగీ  రోగులు హైదరాబాదుకో, విజయవాడ, ఖమ్మం జిల్లాలకు వెళ్లి వైద్యం చేయించుకునేవారు. ఇక్కడే యూనిట్‌ను ఏర్పాటు చేస్తే సౌకర్యంతోపాటు ఉచిత వైద్యం పొందే వీలుంటుంది.
 
  డయాలసిస్ యూనిట్
 
 డయాలసిస్ యూనిట్‌ను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు వైద్యులు, టెక్నీషియన్‌లను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. కిడ్నీ వ్యాధిలో బాధపడుతున్న వారికి అతి తక్కువ ఖర్చుతో డయాలసిస్ చేయనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రిలో యూనిట్ లేకపోవడం వల్ల రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి లక్షలు ఖర్చుచేసే పరిస్థితి ఉండేది. ఈ యూనిట్ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు అతితక్కువ ఖర్చుతో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో రానుంది.
 
 
 మాతాశిశు సంరక్షణ వార్డు స్థాయి పెంపు
 
 ఆస్పత్రికి అనుబంధంగా జాతీయ ఆరోగ్యమిషన్ నిధులతో నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ వార్డు స్థాయిపెరిగింది. వంద పడకలతో నిర్మిస్తున్న వార్డు స్థాయిని 150కి పెంచారు. ఇప్పటి వరకు నిర్మిస్తున్న రెండస్తుల నూతన భవన సమూదాయం పూర్తి కావస్తుంది. మరో యాబై పడకల స్థాయిని పెంచడంతో మరో అంతస్తు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నూతనంగా నిర్మాణం పూర్తి కావస్తున్న భవనంలో కాన్పులవార్డు, పిల్లల వార్డులు మాత్రమే నిర్వహించనున్నారు.  
 
 
 గదులను ఎంపిక చేశాం
 
 ఆస్పత్రిలో బ్లడ్ కాంపోనెంట్, డయాలసిస్ యూనిట్‌ల ఏర్పాటుకు అవసమైన వసతిని కల్పించడానికి గదులను గుర్తించి అధికారులకు నివేదించాము. వాటిని ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరాం. త్వరలో రెండు యూనిట్‌లను రోగులకు అందుబాటులోకి వస్తాయి.  
 - అమర్, సూపరింటెండెంట్
 
 

మరిన్ని వార్తలు