భద్రాద్రిలో అంకురారోహణ

1 Apr, 2017 18:40 IST|Sakshi
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవానికి శనివారం అంకురారోహణ వేడుక అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారికి ఆలయం చుట్టు సేవ నిర్వహించిన అనంతరం బేడా మండపంలోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు.
 
అనంతరం మూలవరుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. బేడా మండపంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం రామాలయంలోని యాగశాలలో మృత్సంగ్రహణం, వాస్తు హోమం వంటివి నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా జరిపే బ్రహ్మోత్సవాలలో పూజా కార్యక్రమాలను నిర్వహించే అర్చక స్వాములకు ఆలయ ఈవో రమేష్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. 
 
వేడుకలో భాగంగా ఆదివారం ఆలయంలో ధ్వజపట భద్రక మండల లేఖన పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం దేవస్ధానం ఆధ్వర్యంలో స్ధానిక జీయర్‌ స్వామి మఠంలో ధ్వజపట భద్రక మండల లేఖన(గరుడ చిత్రం) పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం గరుడాదివాసం, రాత్రికి స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించిస్తారు.
మరిన్ని వార్తలు