పొన్నాల ఇంట్లో మహిళా నేత దీక్ష

9 Apr, 2014 00:58 IST|Sakshi

కంటోన్మెంట్, న్యూస్‌లైన్: కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అవకాశం తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ జీహెచ్‌ఎంసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఐత రజనీదేవి ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె మొదట గాంధీ భవన్‌లో ఆందోళన చేపట్టారు. సాయంత్రం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటి వద్ద ధర్నాకు దిగారు.  
 
తనకు బీ-ఫారం ఇచ్చేవరకు కదిలేది లేదంటూ అర్ధరాత్రి వరకూ ఆమె పొన్నాల నివాసంలోనే ఉన్నారు. మహిళా నేతలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేస్తోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మద్దతు దారులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. మరోవైపు శ్రీకాంత్ అనే కార్యకర్త రజనీదేవికి మద్దతుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నేత దానం నాగేందర్ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించారు.
 
ఉదయంలోగా తేల్చండి: మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించి భంగపడిన మల్‌రెడ్డి రంగారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అధిష్టానంపై మరోసారి ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జానారెడ్డిని వెంటబెట్టుకొని పొన్నాలను కలిశారు. తనకు ఇబ్రహీంపట్నం టికెట్ ఇవ్వాలని, తాను గెలుస్తానని పొన్నాలకు తెలిపారు. అయితే, తనతో చేతిలో ఏమీ లేదని ఈ సందర్భంగా పొన్నాల పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ఉదయంలోగా తనకు టికెట్ ఇస్తే సరని, లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని పేర్కొన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు