గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

21 Jun, 2014 04:46 IST|Sakshi
గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

టేకులపల్లి : మండలంలోని కోయగూడెం పంచాయతీ పరిధి మద్రాస్‌తండా సమీప కొండంగులబోడు గుట్ట ప్రాంతంలో  గిరిజన బాలికపై ఈనెల 12న జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో పదో తరగతి చదువుతున్న బాలుడు కూడా ఉన్నాడు. టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చిలుక రాజిరెడ్డి వివరాలు వెల్లడించారు.
 
ఆయన తెలిపిన వివరాల  ప్రకారం... కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురం (విప్పలచెలక) గ్రామానికి చెందిన బాలిక (17) వరుసకు తమ్ముడైన కుంజా సారయ్యతో కలిసి కోయగూడెం పంచాయతీ మద్రాస్‌తండాలో ఉంటున్న వరుసకు అన్నయ్య అయిన  వట్టం రామారావు ఇంటికి ఈనెల 12న  సాయంత్రం ఆటోలో బయల్దేరింది. సీతారాంపురం స్టేజీ  వద్ద ఆటో దిగి కొండంగులబోడు వరకు నడుచుకుంటూ వెళ్లింది. చీకటి పడుతుండటంతో  మద్రాస్‌తండాకు చెందిన వరుసకు బావ అయిన ఆటో డ్రైవర్ తాటి జగదీశ్‌కు ఫోన్ చేసింది.
 
తమను ఊరిలోకి తీసుకెళ్లేందుకు రమ్మని పిలిచింది. కాసేపటి తర్వాత వస్తానని జగదీష్ చెప్పడంతో ఆమె అక్కడే ఎదురు చూసింది. రాత్రి 7 గంటల తర్వాత తన స్నేహితుడు భూక్య రవి (మధు)తో కలిసి జగదీష్ అక్కడికి చేరుకున్నాడు. బాలిక తమ్ముడిని రవి గట్టిగా పట్టుకోగా ఆమెను రవి ఆటోలోకి లాగి కొండంగులబోడు గుట్ట పక్కన ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి పిలి పించాడు.
 
అక్కడికి చేరుకున్న ఆ యువకులు ఒక రి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేశారు. ఆతర్వాత  హత్య చేసేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించింది. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి బాలికను ఆటోలో ఎక్కించుకుని మద్రాస్‌తండాలోని ఆమె బంధువల ఇంటి సమీపంలో వదిలిపెట్టారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక ఎవరికీ చెప్పుకోలేదు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
నిందితుల అరెస్టు

అత్యాచారం చేసిన పారిపోయిన యువకులు పోలీసులకు ఎట్టకేలకు చిక్కారు. ఆటోలో మద్రాస్‌తండాకు వెళ్తున్నారని సమాచారం అందుకున్న ఎస్సై ముత్తా రవికుమార్ తన సిబ్బందితో కలిసి వలపన్ని పట్టుకున్నారు. తాటి జగదీశ్‌తో పాటు భూక్య సంతోష్, భూక్య రవి(మధు), జర్పుల సురేష్‌తోపాటు ఓ బాలుడిని అరెస్టు చేశారు. వీరిలో నలుగురిని ఇల్లెందు కోర్టుకు తరలించారు. మైనర్‌ను ఖమ్మంలోని బాల నేరస్తుల కోర్టుకు పంపించారు. ఐదుగురిపై నిర్భయ కేసుతోపాటు ఫోక్సో, 366, 376డీ సెక్షన్ల  కింద కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై రవికుమార్, సిబ్బంది సైదులు, ఉపేందర్, వాసు, అనిల్, రవిని అభినందించారు.

మరిన్ని వార్తలు