ఓడిపోతున్న అమ్మతనం

14 Dec, 2014 03:48 IST|Sakshi
ఓడిపోతున్న అమ్మతనం

వంశోద్ధారకుడు కావాలన్న ఆరాటం.. ఆడపిల్లను సాకలేమన్న నిస్సహాయత.. ఏదైతేనేమీ.. జిల్లాలో శిశు విక్రయాల  దుష్ట సంప్రదాయం కొనసాగుతుండడం దురదృష్టకరం. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం తండాలను వీడడం లేదు. ఇక..ఆధునికతకు పేరొందిన పట్టణ ప్రాంతాల్లో ‘కని’కరం లేకుండా ఆడశిశువులను రోడ్డు పక్కన, చెత్తకుప్పల్లో.. మురుగు కాల్వల్లో వేస్తున్న సంఘటనలు అనేకం..
 
ఆడశిశువులను ‘కని’కరం లేకుండా వదిలించుకుంటున్న విషాదాలకు జిల్లాలో ఇక.. ముగింపు లేదా...? విషసర్పాలైన పాములు కూడ గత్యంతర లేని పరిస్థితుల్లో మాత్రమే తాము కన్న పిల్లలను వధిస్తాయని తెలిసిందే. పేదరికం, అధిక సంతానం మనుషులను కూడ కర్కోటకులుగా మారుస్తోంది. నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి సైతం ప్రేమను త్వజించి పేగు తెంచుకుపుట్టిన పసిగుడ్డును పాషాణంగా వదిలేస్తోంది.

 
పసిగుడ్డులను పడేస్తున్న కొందరు..
దత్తత పేరుతో విక్రయిస్తున్న మరికొందరు
జిల్లాలో ఇంకా కొనసాగుతున్న దుష్ట సంప్రదాయం


నల్లగొండ అర్బన్: రోజులు, నెలలు, సంవత్సరాలతోపాటు క్యాలెండర్‌లు మారుతున్నాయి. కానీ అడశిశువులను వదిలించుకునే అనాచారం నుంచి గిరి‘జనం’ బయటపడలేకపోతోంది. ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా, బంగారుతల్లి, కల్యాణ లక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టినా ఈ దుష్ట సంప్రదాయాన్ని నిలువరించలేకపోతున్నారు. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం గిరిజన తండాలను వీడడం లేదు.

శిశు విక్రయాలతో దశాబ్దన్నర క్రితమే పత్రికల్లో పతాక శీర్షికల్లోకెక్కిన దేవరకొండ ప్రాంతంలో తరచు ఇలాంటి అనాచారపు ఆనవాళ్లు మెదలుతూనే ఉండగా, దుష్ట సంస్కృతి తాజాగా జిల్లా కేంద్రమూ మినహాయింపుకాదనే సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు వెళ్లేదారిలో అవాంఛిత మృతశిశువు ఉదంతం వెలుగులోకిచ్చి పదిరోజులైనా కాకముందే దత్తత ముసుగులో శిశు విక్రయ సంఘటన కలకలం రేపడం చర్చనీయాంశమైంది. వదిలించుకుంటున్న శిశువులు రోజుల వయస్సు వారు కావడంతో తల్లిపాలు పొందడం, తల్లిదండ్రుల వద్ద సహజ వాతావరణంలో పెరగడంలాంటి ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారు.
 
1999 నుంచి..
1999 మార్చిలో దేవరకొండ మండలం కొండమల్లేపల్లి శివారు గౌరికుంట తండాలో ఇంద్రావత్ మంగ్లి అనే గిరిజన మహిళ 3 నెలల పసికందును భర్తకు తెలియకుండా అమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో దాదాపు 75 మంది శిశు విక్రయాలు జరిగాయని పరిశోధనల్లో తెలింది. ‘‘ఆడశిశువులను అమ్ముకుంటే ఎంతో కొంతలాభం...లేకుంటే పెంచి పెద్దచేసి పెళ్లిచేస్తే లక్షలవుతది.

అందుకే అమ్ముకుంటున్నాం’’ అని పలువురు గిరిజన మహిళలు పేర్కొనడం వారి పరిస్థితులకు అద్దంపట్టింది. అత్యధికంగా చందంపేట మండలంలో ఆ తర్వాత డిండి, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో విక్రయాలు జరిగినట్లు తేలాయి. ప్రత్యేక ప్యాకేజీ అనంతరం కొంతమేర తగ్గడం, ఆతర్వాత ‘ఊయల’ పేరుతో  శిశుగృహలకు తరలించే ఏర్పాటు చేయడంతో మరికాస్త చైతన్యం వచ్చినా, దత్తత పేరుతో అడపాదడపా శిశు విక్రయాల ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
 
సాటుమాటుగా కొనసాగుతున్న విక్రయాలు..
పెంపకానికనో, దత్తత ఇచ్చామనే సాకులతో శిశు విక్రయాలు సాటుమాటుగా కొనసాగుతూనే ఉన్నాయి. వెలుగుచూసేవి కొన్నైతే...వెలుగులోకి రానివి ఇంకొన్ని. చందంపేట మండలం పోలేపల్లి శివారు ఫకీర్‌నాయక్ తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానమైన నెలవయస్సు దాటని ఆడశిశువును మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు రూ. 15వేలకు కొండమల్లేపల్లి విద్ద విక్రయించారు.

విషయం పోలీసులకు తెలియడంతో శిశువును స్వాధీనం చేసుకుని దేవరకొండలోని శిశు గృహకు తరలించిన సంఘటన తెలిసిందే. తాజాగా హాలియా మండలంలోని రంగుండ్ల తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానంలో జన్మిం చిన ఆడశిశువును మునుగోడు మండలానికి చెందిన ఓవ్యక్తి అప్పగించడం.. నల్లగొండలో జరిగిన వాగ్వివాదంతో విషయం అధికారుల దాకా వెళ్లి పాపను శిశుగృహకు తరలించారు. ఒకప్పుడు గొంతులో వడ్లగింజవేసి అక్కడిక్కడే అవాంఛిత శిశువుల ఉసురు తీసిన సంఘటనల నుంచి శిశు విక్రయాలు, దత్తత ముసుగులో వ్యాపారాలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
 
‘కల్యాణలక్ష్మి’తోనైనా ఆగేనా...
ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ఏటా కొంత నగదును ఇస్తూ మొత్తంగా రూ.2.16లక్షలను అందజేయడం ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ పథకం కొనసాగింపు అస్పష్టంగానే ఉంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారానైనా ఆడపిల్లల జీవితాలకు భరోసా కలగాలని ఆశిద్దాం.
 
ఆడశిశువైతే వీడాల్సిందే...!

వంశోద్ధారకుడు కావాలనే తాపత్రయంతో రెండు, మూడు కాన్పుల వరకు చూసి ఆపై కూడ ఆడ సంతానమే కలిగితే వదిలించుకుంటున్న సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఆస్తి, యాజమాన్యత, దారిద్య్రం, లింగవివక్షలు, వరకట్న సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్న విపత్కర పరిస్థితుల ప్రేరేపణతో నవమాసాలు మోస్ఙికన్న’ ఆ పేగే బరువైపోతోంది. ఈ అనాచారం విశృంఖలంగా మారి పరిస్థితి ఘోరంగా తయారవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ మొదలు అసెంబ్లీ కమిటీల వరకు గిరిజన తండాల్లో పర్యటించి శిశు విక్రయ నిరోధానికి సలహాలు, సూచనలిచ్చాయి.
 
రూ.26 కోట్ల ప్యాకేజీతో కొంతతగ్గినా...

శిశు విక్రయాల సంఘటనలను తీవ్రంగా పరిగణించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ 2001లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటన తర్వాత..దాని నివేదిక ప్రకారం 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి మరికొంత ఆర్థిక సాయం అందించింది. దీంతో కొన్నాళ్లపాటు ఈ అనాచార, ఉదంతాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత యథాతధమయ్యాయి.

మరిన్ని వార్తలు