నాణ్యత పేరుతో దోపిడీ!

21 May, 2015 00:22 IST|Sakshi
నాణ్యత పేరుతో దోపిడీ!

- వరి ధాన్యానికి దక్కని ‘మద్దతు’
- క్వింటాలుకు సగటు ధర రూ.1,250
- తాండూరు మార్కెట్‌లో వ్యాపారుల మాయ!
తాండూరు:
సాధారణ రకం వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుకు ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. నాణ్యతాప్రమాణాల పేరుతో అన్నదాతలను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ‘మద్దతు’ లభించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఊదాసీన వైఖరితో యార్డులో కొందరు కమీషన్ ఏజెంట్లు ఇష్టానుసారంగా పంటకు ధర నిర్ణయించడం వల్ల రైతాంగానికి మేలు జరగడం లేదు. ఈనెల మొదటి వారం నుంచి మార్కెట్ యార్డులో రబీ ధాన్యం కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. తాండూరు నియోజకవర్గం పరిధిలోని యాలాల, బషీరాబాద్, తాండూరు,పెద్దేముల్ మండలాలతోపాటు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు తాండూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు.

పట్టణంలోని పౌరసరఫరాల గోదాంలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుందనే కారణంతో చాలా మంది రైతులు మార్కెట్ యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారు.   సాధారణ వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,360 చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  కానీ ఇప్పటివరకు యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు సుమారు 13,463 క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నారు. క్వింటాలుకు గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200, సగటు ధర రూ.1,250 మాత్రమే పలికింది. ఈ మూడు ధరలను పరిశీలించినా కనీస మద్ధతు ధర రైతులకు లభించలేదని స్పష్టమవుతోంది. ఈ ధరల ప్రకారం రైతులు క్వింటాలుకు రూ.60 నుంచి రూ.160 వరకు నష్టపోయారు. నాణ్యతాప్రమాణాలు లేనందుకే మద్దతు ధర పలకడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత పేరుతో రైతన్నల శ్రమ దోపిడీకి గురవుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు