‘టౌన్ ప్లానింగ్’కు కొత్త రూపు!

29 Sep, 2014 00:56 IST|Sakshi
‘టౌన్ ప్లానింగ్’కు కొత్త రూపు!

ప్రభుత్వ పరిశీలనలో ‘తెలంగాణ కంట్రీ, టౌన్‌ప్లానింగ్’ చట్టం
     
నేటికీ ఆంగ్లేయుల  కాలం నాటి చట్టమే దిక్కు
పట్టణ బృహత్ ప్రణాళికల తయారీకే  డీటీసీపీ పరిమితం
కొత్తం చట్టం వస్తే గ్రామీణ, జిల్లా, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు మార్గం

 
హైదరాబాద్: తెలంగాణలో టౌన్ ప్లానింగ్ కొత్త రూపు సంతరించుకోనుంది. బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న చట్టం బుట్ట దాఖలు కానుంది. కొత్త చట్టం రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ కంట్రీ, టౌన్ ప్లానింగ్(ఏపీసీటీ) చట్టం-1920’ ఆంగ్లేయుల కాలం నాటిది. మరో ఐదేళ్లు గడిస్తే నూరేళ్లు పూర్తి చేసుకోనున్న ఈ చట్టాన్ని సవరణలు లేకుండా ఇప్పటికీ యథాతథంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టం వల్ల ‘డెరైక్టరేట్ ఆఫ్ కంట్రీ, టౌన్‌ప్లానింగ్(డీటీసీపీ)’ విభాగం కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే బృహత్ ప్రణాళికలు(మాస్టర్ ప్లాన్స్) రూపొందించేందుకు పరిమితమైంది. మండల కేంద్రాల అవసరాల కోసం డీటీసీపీ అనధికారికంగా ‘ఇండికేటివ్ ల్యాండ్ యూజ్ ప్లాన్’(ఐఎల్‌యూపీ) రూపొందించి అంది స్తున్నా, వీటికి చట్టబద్ధత లేదు. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ, మండల, జిల్లా, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలు తప్పనిసరి. డీటీసీపీకి అధికారం లేకపోవడంతో ఇప్పటివరకు ఈ ప్రణాళికలు రూపుదిద్దుకోలేదు. కాలం చెల్లిన ఏపీసీటీ చట్టాన్ని సవరించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో డీటీసీపీ అధికారులు ప్రయత్నించినా ప్రభుత్వం ఆమోదించకపోవడంతో సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో డీటీసీపీ తెలంగాణ రాష్ట్ర అధికారులు తాజాగా ‘తెలంగాణ కంట్రీ, టౌన్ ప్లానింగ్ ముసాయిదా చట్టాన్ని’ రూపొం దించి రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన కోసం పంపించారు. కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చట్టాలను ఆదర్శంగా తీసుకుని ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. ప్రాథమిక దశలో ఉన్న కసరత్తు పూర్తైచట్ట రూపాన్ని సంతరించుకుంటే డీటీసీపీ కొత్త అధికారాలను అందిపుచ్చుకోనుంది. గ్రామీణ, మండల, జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర బృహత్ ప్రణాళికలు రూపొందించేందుకు డీటీసీపీకి అధికారులు సంక్రమించనున్నాయి.

వనరులతో అభివృద్ధికి ప్లాన్..!

రాష్ట్రంలో సహజ వనరులకు కొదవ లేదు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నా.. వాటిని సరైన రీతిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఆయా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రతిపాదనలో ఉన్న కొత్త చట్టం అమలులోకి వస్తే సహజ వనరుల ఆధారంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చో పేర్కొంటూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి బృహత్ ప్రణాళికలు రూపొందిస్తారు. ఓ ప్రాంతానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించడానికి ముందు ఆ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను గుర్తిస్తారు. ఆ వనరులను వినియోగంలోకి తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకురావచ్చో సూచించేలా బృహత్ ప్రణాళికను తయారు చేస్తారు. పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఈ కొత్త తరహా ప్రణాళికలు బాగా ఉపయోగపడనున్నాయి. తొలుత డీటీసీపీ గ్రామ పంచాయతీ, మండలాలకు బృహత్ ప్రణాళికలను తయారుచేసి అందించనుంది.

ఆ తర్వాత గ్రామ, మండల, పట్ణణ ప్రణాళికలకు సంగ్రహ రూపంగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలను, అన్ని జిల్లాల ప్రణాళికలను సంగ్రహించి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తుంది. స్థానికంగా అందుబాటులో ఉన్న సహజ, మానవ వనరులను వినియోగించుకుంటూ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ రకమైన పరిశ్రమలు స్థాపించవచ్చు? ఏఏ ప్రాం తాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చు తదితర అంశాలు ఈ ప్రణాళికల్లో ఉండనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాంత అభివృద్ధికి సైతం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకుని అమలు చేసుకోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ఈ తరహాలో కేరళ ప్రభుత్వం రూ పొందించిన ‘కొల్లం జిల్లా అభివృద్ధి ప్రణాళిక’ విజయవంతం కావడంతో పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి.

ప్రణాళికల మండళ్లు..

ప్రణాళికల తయారీ కోసం జిల్లా స్థాయిలో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్ మండలి.. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర టౌన్, కంట్రీ ప్లానింగ్ మండలిని ఏర్పాటు చేయాలని కొత్తగా ప్రతిపాదించిన చట్టంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీటీసీపీ సిఫార్సు చేసింది. ఈ మండలిల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండి ప్రణాళికల తయారీకి సలహాలు, సూచనలు అందజేయాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు