సందడేది..?

27 Feb, 2015 23:51 IST|Sakshi

సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ఎక్కడా కనిపించడంలేదు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మొత్తం 33మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో జిల్లాకు చెందిన ఐదుగురున్నారు. మార్చి 2వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో బరిలో ఎందరు నిలుస్తారనేది స్పష్టత రానుంది.
 
 బరిలో ప్రధాన పార్టీలు...
 మేధావివర్గం ఎన్నికలుగా భావించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గతంలో ప్రధాన రాజకీయపార్టీలు దూరంగా ఉండేవి. కానీ ఈసారి ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆసక్తిగా మారింది. 2007, 2009లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టింది. 2007ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టింది. ఆ తర్వాత 2009లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగేశ్వర్‌కు మద్దతిచ్చింది. ఈసారి టీఆర్‌ఎస్ ఫేవరెట్‌గా ఎన్నికల బరిలో నిలిచింది. అంతేకాదు ఉద్యోగ సంఘాల నాయకుడైన దేవీప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొట్ట మొదటిసారిగా తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన వ్యక్తి పాలమూరు వాసే కావడం గమనార్హం. జిల్లానుంచి బరిలో నిలిచిన వారిలో ఐదుగురు ఉన్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్‌గుప్త కాగా.. మిగతా వారు స్వతంత్ర అభ్యర్థులుగా.. కృపాచారి(ఖిల్లాగణపురం), బంగారయ్య (నాగర్‌కర్నూల్), ఎండీ అబ్దుల్ అజీజ్ ఖాన్ (అమిస్తాపూర్), లక్ష్మణ్‌గౌడ్(వనపర్తి) ఉన్నారు.
 
 చడీ చప్పుడు లేదు...
 ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఎక్కడా మొదలు కాలేదు. అయితే బీజేపీ మాత్రం సుమారు 6నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించి చాపకింద నీరులా ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఇక కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఓటరు నమోదు కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నాయి. కానీ తీరా షెడ్యూల్ రాగానే అభ్యర్థులను బరిలో దించాయి. కొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవాలనే ముందుచూపుతో ఓటరు నమోదులో మొగ్గుచూపారు. దీంతో ఓటర్ల సంఖ్య జిల్లాలో రెట్టింపు అయ్యింది. గతంలో 32వేల ఓటర్లు ఉండగా ప్రస్తుతం 66వేలకు చేరుకుంది.
 
 జిల్లా నేతలకు పరీక్ష...
 ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధానపార్టీల నేతలకు సవాల్‌గా మారింది. టీఆర్‌ఎస్ పార్టీ టీఎన్‌జీఓ అధ్యక్షడు దేవీప్రసాద్‌ను అభ్యర్థిగాప్రకటించింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరూ ఎంత మేరకు సమన్వయంతో పనిచేస్తారనే అంశం మీదే అధికారపార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించినా పార్టీ అంతర్గతంగా అసంతృప్తులు చెలరేగుతున్నాయి. తమను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని జిల్లా నేతలు గుర్రుగా ఉన్నారు.
 
  కాంగ్రెస్ టికెట్టు పొందిన తర్వాత రవికుమార్ ఇటీవలి కాలంలో ఒక మాజీ మంత్రి మద్దతు కోరేందుకు వెళితే... అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత గుర్తొచ్చామా? అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే పీసీసీ మాత్రం మొట్ట మొదటిసారిగా అభ్యర్థిని రంగంలోకిదించినందున గెలుపు కోసం ఒక కమిటీ వేసింది. అయితే, నేతలు ఎంత మేరకు సమన్వయంతో పనిచేస్తారనే మున్ముందు తేలనుంది. బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో ముందు పక్కా వ్యూహంతో పనిచేస్తోంది. ఆరు నెలల నుంచి పనులు ప్రారంభించినా.. రెండు, మూడు నెలలుగా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను సంసిద్ధులను చేస్తోంది.
 
 గెలుపులను నిర్ణయించేది వీరే..!
 పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ప్రధానంగా గెలుపోటముల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగులు, కీలకపాత్ర పోషించనున్నారు. ఈ వర్గాల మద్దతు కూడగట్టుకునే వారికే మాత్రమే సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా నుంచి రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నేతలు టీఆర్‌ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వారికి చివరకు నిరాశ ఎదురవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వారు ఎంతవరకు సహరిస్తారనేది తేలాల్సి ఉంది. మరోవైపు విద్యార్థి, యువజన సంఘాలు కూడా కీలకం కానున్నాయి. వీటిని ఏ విధంగా సమన్వయం చేస్తారనేది మున్ముందు తేలాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు