వారంలోగా మహిళల కోటా స్థానాలు!

10 Apr, 2016 05:32 IST|Sakshi
వారంలోగా మహిళల కోటా స్థానాలు!

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మహిళలకు 33శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్కెటింగ్ చట్టానికి సవరణలు ప్రతిపాది స్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందిం ది. తాజా సవరణ మేరకు రాష్ట్రంలోని 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 55 మార్కెట్లకు చైర్‌పర్సన్ స్థానాలు దక్కనున్నాయి. అయితే కేటగిరీల వారీగా మహిళలకు దక్కే మార్కెట్ కమిటీలను గుర్తించడంపై మార్కెటింగ్‌శాఖ దృష్టి సారించింది.

గతంలో కేటగిరీల వారీగా కేటాయించిన కోటా నుం చే.. మహిళలకు దక్కే స్థానాలను గుర్తించాలని మార్కెటింగ్‌శాఖ ప్రాథమికంగా నిర్ణయించిం ది. నామినేటెడ్ పదవుల భర్తీని ప్రభుత్వం నెలాఖరులో చేపడుతుందనే వార్తల నేపథ్యం లో.. వీలైనంత త్వరగా మార్కెట్ కమిటీల్లో మహిళా కోటా స్థానాలను గుర్తించనున్నారు. నిజానికి గడాది సెప్టెంబర్‌లోనే  కేటగిరీల వారీగా రిజర్వేషన్ కోటా ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కే మార్కెట్ కమిటీలను రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా లాటరీ ద్వారా ఎంపిక చేశారు.  

తొలి ఏడాది లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయగా.. తర్వాతి ఏడాది నుంచి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీల పదవీకాల పరిమితి ఏడాది కాగా.. ఈ కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌తో 14 మంది సభ్యులు వుంటారు.
 
లాటరీ విధానంలో రిజర్వేషన్లు
కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని.. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి చైర్మన్‌గా, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి సూర్యప్రభ సభ్యులుగా వున్న కమిటీలాటరీ విధానంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీల కుగాను..పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు.

మిగతా 168 మార్కెట్ కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు - 6 శాతం, ఎస్సీలకు - 15 శాతం, బీసీలకు- 29 శాతం చొప్పున మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కేటాయించారు. మిగతా 84 కమిటీలను అన్ రిజర్వుడు (ఓసీ)గా పరిగణిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. తాజా సవరణ నేపథ్యంలో షెడ్యూలు ఏరియాలోని మార్కెట్ కమిటీలను మినహాయిస్తే.. మిగతా 168 కమిటీల్లో 33శాతాన్ని మహిళలకు రిజ ర్వు చేయాల్సి వుంటుంది. ఈ లెక్కన మహిళలకు 55 స్థానాలు దక్కే అవకాశం వుందని మార్కెటింగ్‌శాఖ వర్గాలు వెల్లడించాయి. వారంలోగా మహిళలకు రిజర్వు చేసిన కమిటీల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేస్తామని మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ శరత్ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు