మాస్టర్ ప్లాన్ మరిచారా..

24 Dec, 2015 01:30 IST|Sakshi

రెండేళ్లుగా ముఖ్యమంత్రి  కార్యాలయంలో ఫైల్ పెండింగ్
కాలంచెల్లిన ప్రణాళికతో   ప్రజల ఇబ్బందులు
చారిత్రక నగరం అభివృద్ధికి  అడ్డంకులు

 
1972లో రూపొందించిన మాస్టర్ ప్లానే ప్రస్తుతం అమలులో ఉంది. 1991 నాటికి నగర  విస్తీర్ణం, జనాభాను అంచనా వేసి  మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అప్పుడు నగర విస్తీర్ణం 90 చదరపు కిలో మీటర్లు, జనాభా 4,61,123 ఉంటుందని అంచనా వేశారు.
 
హన్మకొండ : వరంగల్ నగరానికి హృదయ్, అమృత్, స్మార్ట్‌సిటీ వంటి ప్రతిష్టాతక పథకాలలో చోటు దక్కుతున్నప్పటికీ.. మహానగర అభివృద్ధిలో ప్రాథమికంగా అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన వరంగల్ నగర మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తోంది. ఓరుగల్లు ఔన్నత్యం, వారసత్వ సంపద, పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యమిస్తూ మహానగర అభివృద్ధి ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపొందించారు. ఈ ఫైల్ రెండేళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దశాబ్దకాలంలో వరంగల్  నగరం వేగంగా విస్తరించింది. కానీ, మహానగర అభివృద్ధి కోసం ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా మాస్టర్ ప్లాన్ మాత్రం రూపుదిద్దుకోవడం లేదు. 1972 నాటికి మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా తీసుకునే అన్ని పనులు జరుగుతున్నాయి.

కాలంచెల్లిన ఈ మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నివాస ప్రాంతాల, పారిశ్రామిక ప్రాంతాల వర్గీకరణలో వాస్తవ పరిస్థితలకు పొంతనలేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న భూములు, భవనాల క్రమబద్ధీకరణ పథకాల(ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్) సైతం ఆశించిన స్థాయిలో ప్రజలకు ఉపయోగపడడం లేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపైన కూడా ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి. భూ వినియోగం కేటగిరీలో మార్పులు చేయకపోవడంతో కార్పొరేషన్ అధికారులు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో అనుమతి లేని నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు, ‘కుడా’ ఆదాయానికి గండిపడుతోంది.

ఇప్పటికీ 1972 నాటి ప్లానే..
కాకతీయ పట్టణాభివద్ది సంస్థ(కుడా) 1972లో రూపొందించిన మాస్టర్ ప్లానే ప్రస్తుతం అమలులో ఉంది. 1991 నాటికి నగరం విస్తీర్ణం, జనాభాను అంచనా వేసి  మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అప్పుడు నగర విస్తీర్ణం 90 చదరపు కిలో మీటర్లు, జనాభా 4,61,123 ఉంటుందని అంచనా వేశారు. ఈ గణాంకాల ఆధారంగా నగరంలో రోడ్లు, డ్రెరుునేజీలు, నాలాలు, పరిశ్రమలు, భూముల వినియోగం అంశాలను నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్‌ను ప్రతీ 25 ఏళ్లకు ఒకసారి మార్చాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడతో కాలంచెల్లిన మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమలవుతోంది.

కొత్త మాస్టర్ ప్లాన్ ఇలా..
2031 వరకు వరంగల్ మహానగరం అవసరాలను ప్రాతిపదికగా చేసుకుని అన్ని వర్గాల సూచనలతో కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. 1,805 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరంగల్, కరీంనగర్ జిల్లాలోని 171 గ్రామాలను కలుపుతూ 24 లక్షల జనాభాకు అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ తయారైంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ 2013 డిసెంబర్‌లో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ఈ ఫైల్ అప్పటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాస్టర్‌ప్లాన్‌పై నిర్ణయం తీసుకోవాలని వరంగల్ నగర ప్రజలు కోరుతున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు