మనోడే ఇచ్చేయ్‌!

8 Feb, 2018 03:45 IST|Sakshi

అంగట్లో సబ్సిడీ ట్రాక్టర్లు.. ఇష్టారాజ్యంగా మంత్రి కోటా

పైరవీలతో దక్కించుకుంటున్న ‘అధికార’ నేతలు

ట్రాక్టర్‌పై నేతలు, దళారులకు రూ.లక్ష కమీషన్‌

పైరవీ లేనిదే ట్రాక్టర్‌ అందని దుస్థితి

కలెక్టర్ల ఎంపిక కాగితాలకే పరిమితం

‘ఎస్‌క్యూఆర్‌’ పద్ధతిపై విమర్శల వెల్లువ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సబ్సిడీ ట్రాక్టర్ల దందా జోరుగా సాగుతోంది! లబ్ధిదారులకు దక్కాల్సిన ట్రాక్టర్లు పైరవీలతో పక్కదారి పడుతున్నాయి. దళారులు, కొందరు రాజకీయ నేతలు కమీషన్లు పుచ్చుకొని సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు అమ్మేస్తున్నారు. కలెక్టర్ల నేతృత్వంలో లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉన్నా.. అధికార పార్టీ నేతల హవానే నడుస్తోంది. అర్హులైనా కాకున్నా వారనుకున్న వారికే ట్రాక్టర్లు దక్కుతున్నాయి. ట్రాక్టర్లు దక్కించుకోవడం కోసం అనేకమంది దళారులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ సిఫార్సు లేఖ తీసుకొని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయంలో అందజేసి ట్రాక్టర్లు ఎగరేసుకుపోతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు రాజేస్తోంది.

అన్నీ వారికేనా..?
ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రత్యేక కోటా కింద అధిక సంఖ్యలో ట్రాక్టర్లు పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరికే ఎక్కువగా కేటాయిస్తున్నారంటూ ట్రాక్టర్లు దక్కని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. సిఫార్సు లేఖలపై ఓ ఎస్టీ ఎమ్మెల్సీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. తన కార్యకర్తల కోసం మంత్రిని ట్రాక్టర్లు కావాలని కోరితే.. ఆయన సంతకం చేసి పంపించినా ఇప్పటివరకు ఒక్కటీ మంజూరు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సీనియర్‌ మంత్రి విన్నపం మేరకు.. ఆయన కార్యకర్తల కోసం ఏకంగా 200 పైగా ట్రాక్టర్లు ప్రత్యేకంగా కేటాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికార పార్టీలో ట్రాక్టర్లు దక్కని ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

ట్రాక్టర్‌కు రూ.లక్ష కమీషన్‌
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో వీటిని సరఫరా చేస్తుంది. ఒకేసారి గ్రూపు లేదా వ్యక్తిగతంగా వీటిని ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. భారీ సబ్సిడీ ఉండటంతో గ్రామాల్లో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. రైతులు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్‌ బృందం పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. తర్వాత అర్హుల జాబితాను జిల్లా వ్యవసాయశాఖకు పంపిస్తారు. కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి అర్హులైనవారితో తుది జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితా ప్రకారం రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలి. కానీ ఈ తంతు కేవలం కాగితాలకే పరిమితమైంది. ట్రాక్టర్‌ ఇప్పించేందుకు కొందరు దళారులు, మరికొందరు ప్రజాప్రతినిధులు రైతుల నుంచి రూ.లక్ష వరకు ముడుపులు పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జాబితాలో పేరు లేకున్నా..
ట్రాక్టర్ల పంపిణీలో గోల్‌మాల్‌కు అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు సిరిసిల్ల మండలంలో మండల కమిటీ ద్వారా 25 మంది అర్హుల రైతుల జాబితా పంపగా అందులోంచి కేవలం ఐదుగురుని మాత్రమే ఎంపిక చేశారు. మరో నలుగురిని జాబితాలో పేరు లేకున్నా పైస్థాయి సిఫారసు లేఖల ద్వారా ఎంపిక చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో కూడా ఇలాగే ఉంది. చొప్పదండిలో 10 ట్రాక్టర్లు ఉన్న రైతులకే మళ్లీ ఇచ్చారని, ఏ ప్రాతిపదికన వారు అర్హులవుతారని ఏకంగా జెడ్పీ సమావేశంలోనే సభ్యులు ఆరోపించారు. ఇలా అనర్హులైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధి పైరవీ ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక కోటా కింద ట్రాక్టర్లు కేటాయిస్తున్నారు.

ఇదేం పద్ధతి..?
2016–17 నుంచి ట్రాక్టర్ల కేటాయింపులో స్పెషల్‌ రిజర్వ్‌డ్‌ కోటా(ఎస్‌ఆర్‌క్యూ) పద్ధతిని ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి సిఫార్సు చేసిన రైతులకే ట్రాక్టర్లు మంజూరు చేయడం దీని ఉద్దేశం. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫారసులు చేసి తమకు అనుకూలమైన వారికి ట్రాక్టర్లు ఇప్పించుకుంటున్నారు. పూర్తిగా పైరవీలపై నడిచే ఈ పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బినామీ పేర్లతో ఎమ్మెల్యేలే ట్రాక్టర్లు పొందుతున్నారని ఓ ఎమ్మెల్సీ ఆరోపణలు చేయడం గమనార్హం. 2016–17 నుంచి ఇప్పటివరకు మొత్తం 5 వేల ట్రాక్టర్ల వరకు ఇస్తే అందులో ఎస్‌ఆర్‌క్యూ కింద వ్యవసాయ మంత్రి కార్యాలయ విచక్షణతో ఏకంగా 700 వరకు ట్రాక్టర్లు ఇచ్చారు ‘‘ఎస్‌ఆర్‌క్యూ పద్ధతి ప్రవేశపెట్టాక వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం ప్రతిష్ట దిగజారుతోంది. మరోవైపు ఆయన పేషీ నుంచి వచ్చే సిఫార్సు లేఖలు మంత్రికి తెలుస్తున్నాయా? లేదా? అన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం మంత్రి ప్రతిష్టకు మచ్చగా ఉంది’’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సచివాలయం, వ్యవసాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలోనూ పైరవీకారులు పెద్దఎత్తున దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి రెండుచోట్లా ఒకరిద్దరు అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ వ్యవహారం కావడంతో ఈ దందాపై మాట్లాడేందుకు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ముందుకు రావడం లేదు. ‘నో కామెంట్‌’అని, తమ వివరణ అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు