ఖజానా గలగల 

27 May, 2019 07:58 IST|Sakshi
జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

జడ్చర్ల: పట్టణంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. దాని ఫలితంగా స్థానిక సబ్‌రిజిస్ట్రేషన్‌ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా రూ.42.76 కోట్లు ఆదాయం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్థాయిలో ఆదాయం సమకూర్చుకునే దిశగా ముందుకు సాగుతుంది. ఏప్రి ల్, మే నెలల్లోనే దాదాపు రూ.కోటి వరకు ఆదాయం వచ్చిందంటే ఇక్కడ నిత్యం వందకుపైగా రిజిస్ట్రేషన్‌లు నమోదవుతున్నాయి.

జోరుగా రియల్‌ వ్యాపారం 
జడ్చర్ల సబ్‌రిజిస్ట్రేషన్‌ పరిధిలోని బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, భూత్పూర్‌ మండలాల్లో  రియల్‌ బూమ్‌ కొనసాగుతుండడంతో రిజిస్ట్రేషన్‌ ఆదాయం గణనీయంగా పెరు గుతూ వస్తోంది. వందల ఎకరాల్లో వెంచర్లు వెలుస్తుండడం, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎప్పటికప్పుడు చేస్తుండటం, మళ్లీ అవే ప్లాట్లు చేతులు మారుతుండడంతో రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదాయం లభిస్తోంది. అదేవిదంగా వ్యవసాయ భూములు కూడా భారీగా చేతులు మారుతుండడంతో రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరిగిందనే చెప్పాలి.

ప్రధానంగా జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, భూత్పూర్‌ మండలాల పరిధిలో 44వ నంబర్‌ జాతీయరహదారి ఉండడంతో ఈ రహదారిని అనుసరించిన భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. అదేవిధంగా 167 నంబర్‌ జాతీయరహదారిని అనుసరించి ఉన్న జడ్చర్ల, మిడ్జిల్‌ మండలాల పరిధిలో సైతం భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జోరందుకోవడంతో రిజిస్ట్రేషన్‌ శాఖకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంది.

జడ్చర్లలో మరింత డిమాండ్‌ 
జడ్చర్ల పరిధిలో భూములు, ప్లాట్లకు మంచి డిమాండ్‌ ఉంది. అటు ఇటుగా జాతీÆయ రహదారులననుసరించి ఎకరం భూమి ధర రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల దాక పలుకుతుందంటే డిమాండ్‌ ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఇక జడ్చర్ల చుట్టుపక్కల చదరపు గజం ధర రూ.10వేలు మొదలు రూ.40వేల దాక కొనసాగుతోంది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడం, పోలేపల్లి సెజ్‌లో పరిశ్రమల కొనసాగింపుతో ఈ ప్రాంత భూములకు రెక్కలొచ్చాయి.  

మరిన్ని వార్తలు