‘జంట’ జిల్లాలతో తంటా

19 May, 2015 02:47 IST|Sakshi
‘జంట’ జిల్లాలతో తంటా

పూర్తికాని ఓటరు కార్డు, ఆధార్ అనుసంధానం
రంగారెడ్డి, హైదరాబాద్‌లో 40 శాతం దాటని వైనం
మిగతా ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా సీడింగ్

 
రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓటర్లకు చెక్ పెడుతూ.. ఓటరు జాబితాలో అక్రమాలకు కళ్ళెం వేయాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటరు కార్డు వివరాలను ఆధార్‌తో అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో రాష్ట్ర లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,81,52,182 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకూ 2,13,04,942 ఓటరు కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 75.67 శాతం సీడింగ్ పూర్తయింది.
 
రెండు జిల్లాల్లోనే వెనుకబాటు..


రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాలకుగానూ ఎనిమిది జిల్లాల్లో ఓటర్ కార్డులు, ఆధార్ వివరాల అనుసంధాన ప్రక్రియ 90 శాతానికి పైగా పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.98 శాతం ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత స్థానాల్లో కరీంనగర్ (99.94%), మహబూబ్‌నగర్(99.86%) జిల్లాలున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 90 శాతానికి పైగా సీడింగ్ పూర్తయింది. కానీ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం ఈ ప్రక్రియ 40 శాతం దాటలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూక్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు దిగిన రెవెన్యూ యంత్రాంగం దాదాపు ఆరు నెలలుగా కుస్తీపడుతున్నా ఇప్పటికీ క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన పూర్తికాలేదు.

ఈ క్రతువులో అధికారులు బిజీగా ఉండడంతో ఎపిక్, ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. వచ్చే నెలలో పట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో సీడింగ్ ప్రక్రియ అటకెక్కినట్లైంది. ఫలితంగా క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకూ సీడింగ్ ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుందని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు