కృష్ణాలో 45 టీఎంసీల వాటా పెంచండి 

28 Apr, 2018 01:46 IST|Sakshi

కేంద్రమంత్రి గడ్కరీకి హరీశ్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటివాటాను ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. తెలంగాణకు ఉన్న నీటివాటా 299 టీఎంసీలకు అదనంగా పట్టిసీమతో దక్కే 45 టీఎంసీల నీటివాటాను కలిపి 2018–19 వాటర్‌ ఇయర్‌ నుంచి నీటి కేటాయింపులు పెంచాలని కోరారు.

ఈ మేరకు హరీశ్‌ శుక్రవారం గడ్కరీకి లేఖ రాశారు. ‘1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న పైరాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువరాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే.

పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పైరాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్‌ అవార్డులో ఉంది. ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది. పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45టీఎంసీల వాటా ఇవ్వాలి’అని లేఖలో పేర్కొన్నారు. పట్టిసీమతో దక్కే వాటాలపై కేంద్రానికి ఇదివరకే అనేక లేఖలు రాశామని, అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై తేల్చేందుకు ఏకే బజాజ్‌ కమిటీని నియమించినా ఆ కమిటీ ఏమీ తేల్చలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకొని 45 టీఎంసీల నీటిని కేటాయించి తెలంగాణ వాటాను పెంచాలని కోరారు.   

మరిన్ని వార్తలు