పంచాయతీలో 50శాతం రిజర్వేషన్లు పెంచండి

5 Jun, 2018 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగలేఖ రాశారు. బీసీ జనాభా 56 శాతానికిపైగా ఉంటే రిజర్వేషన్ల ఫలాలు, సంక్షేమ పథకాలు, బడ్జెట్‌లో నిధులు మాత్రం దామాషా పద్ధతిలో అందడం లేదని దీంతో బీసీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి అభ్యున్నతికి అవరోధంగా మారిందన్నారు.

సీఎం కేసీఆర్‌ స్వయంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 2011లో యూపీఏ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా సకలజనుల సర్వే ద్వారా జనాభా లెక్కలు సేకరించినప్పటికీ వాటిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదన్నారు. 1932లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కలు కులాల వారీగా సేకరించిందని, ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు