సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలి

7 Dec, 2017 04:23 IST|Sakshi
రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ అశ్వనీ లోహానికి జ్ఞాపికను అందిస్తున్న ఆస్కీ చైర్మన్‌ పద్మనాభయ్య, డైరెక్టర్‌ ఖ్వాజా

రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ అశ్వనీ లోహాని

హైదరాబాద్‌: సమయానుకూలమైన మార్పు చేర్పులు, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, చక్కటి పని సంస్కృతితో సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని భారత రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ అశ్వనీ లోహాని అన్నారు. సిబ్బందికి పూర్తి పని స్వేచ్ఛ ఇస్తూ జవాబుదారీతనం పెంచడం ద్వారా చక్కటి పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఎర్రమంజిల్‌లోని ఆస్కీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘ఆస్కీ 61వ ఫౌండేషన్‌ డే లెక్చర్‌’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిబ్బందిలో నీతి, నిజాయితీతో పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించాలని కోరారు. ఉద్యోగులను ప్రోత్సహించడం, వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా సంస్థను అద్భుతంగా ముందుకు నడపవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆస్కీ చైర్మన్‌ పద్మనాభయ్య, డైరెక్టర్‌ ఆర్‌హెచ్‌.ఖ్వాజా లోహానిని సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఇక నుంచి రైల్వే ఉద్యోగులకు ఆస్కీలో శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ ప్రకటించారు.  

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ బాగుంది.. 
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ బాగుందని అశ్వనీ లోహాని కితాబిచ్చారు. బుధవారం ఆయన సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల సదుపాయాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది సేవలను అభినందించారు. రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. అనంతరం చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ అర్జున్‌ ముండియా, చీఫ్‌ వర్క్‌షాపు మేనేజర్‌ ఎం.విజయ్‌కుమార్‌ ఆయనకు లాలాగూడలోని సీడబ్ల్యూఎస్‌ వర్క్‌షాప్‌ పనితీరును వివరించారు. అనంతరం రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజినల్‌ రైల్వేమేనేజర్‌లతో మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు