నష్టాలను పూడ్చుకునేందుకు..

30 Jan, 2020 02:43 IST|Sakshi

వాస్తవికతతో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన

రూ.11 వేల కోట్లకు చేరిన డిస్కంలు నష్టాలు

31న ఈఆర్సీకి డిస్కంల నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయానికి సిద్ధమైంది. ఆర్టీసీ చార్జీల పెంపు తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచబోతోంది. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపును అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. డిస్కంలను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈసారి వాస్తవిక దృక్పథంతో విద్యుత్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కంల ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేసేందుకు ఎంత మేరకైనా చార్జీలు పెంచాలని భావిస్తోంది.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విద్యుత్‌ రాయితీలు పోగా మిగిలే ఆర్థిక లోటును పూర్తిగా విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ చార్జీల పెంపు భారం తీవ్రంగానే ఉండనుందని అధికారవర్గాలు సంకేతాలిస్తున్నారు. 2020–21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను ఈనెల 31న డిస్కంలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించే అవకాశాలున్నాయి.

రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా కోసం డిస్కంలు చేయనున్న వ్యయం, ప్రస్తుత చార్జీలతో వచ్చే ఆదాయ, వ్యయాలతో పోలిస్తే ఆదాయ లోటు అంచనాలు, విద్యుత్‌ రాయితీలు తీసేయగా మిగిలే ఆదాయ లోటును భర్తీ చేసేం దుకు పెంచాల్సిన విద్యుత్‌ చార్జీ ల సమాచారం ఈ నివేదికలో ఉండనుంది. ఏటా దాదా పు రూ.2 వేల కోట్ల వరకు విద్యుత్‌ చార్జీలను పెంచితేనే డిస్కం లు ఆర్థికంగా నిలబడనున్నాయని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గృహ, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులకు సరఫరా చేసే విద్యుత్‌ చార్జీలను సైతం డిస్కంలు పెంచబోతున్నాయి.

మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష
విద్యుత్‌ సంస్థల సీఎండీలతో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఎత్తిపోతల ప్రాజెక్టులకు చౌకగా విద్యుత్‌ సరఫరా చేయడం సా ధ్యం కాదని విరమించుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు