ఉల్లి ధర బెంబేలెత్తిస్తోంది

18 Jun, 2014 02:40 IST|Sakshi
ఉల్లి ధర బెంబేలెత్తిస్తోంది

కామారెడ్డి : ఉల్లి కోయకముందే కన్నీళ్లు పెట్టిస్తోంది. కొనేందుకు పోతే ధరతో బెంబేలెత్తిస్తోంది. మొన్నటి వరకు కిలో రూ. 10 నుంచి రూ.15 పలికిన ఉల్లిగడ్డ ధరలు రెట్టింపయ్యాయి. కిలోకు రూ.28 నుంచి రూ.30 వర కు అమ్ముతున్నారు. మార్కెట్‌కు వెళ్లి ఉల్లి ధరలను అడిగి ఖంగుతింటున్నారు. నెలక్రితం ఉల్లిధర కిలోకు రూ.5 నుంచి రూ.8 వరకు ఉండేది. తర్వాత పెరుగుతూ వచ్చిన ధర కిలోకు రూ.12 వరకు చేరింది. పది రోజుల్లోనే ధర ఒక్కసారిగా పెరిగిపోయింది.
 
ఈ ధరలను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసిన తర్వాత ఉల్లి ధరలు మరింత పెరుగవచ్చని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది కూడా ఇలాగే ఉల్లిగడ్డ ధరలు పెరగడంతో వాడకాన్ని తగ్గించుకున్నారు. హోటళ్లలో ఏకంగా ఉల్లిపాయలు లేవనే బోర్డులు సైతం తగిలించిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా ఉల్లిగడ్డ ధర మరింత పెరిగే అవకాశాలుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
కూరగాయల ధరలూ..
పేద, మధ్యతరగతి ప్రజలు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ కూరగాయలు కొనేందుకు వెళ్లినవారికి వాటి ధరలు దడపుట్టిస్తున్నాయి. పదిరోజుల కిందట వందరూపాయలకు పెడితే వారం, పది రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో ఇప్పుడు రూ.200లు పెట్టినా తక్కువే వస్తున్నాయి. కొత్తిమీర ధర అమాంతం పెరిగింది. కిలోకు రూ.125 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నారు. ఓ కుటుంబానికి వారం రోజులకు పావుకిలో కొత్తిమీర అవసరమవుతుంది. ఆమేర కొనాలంటే కనీసం రూ.40 వెచ్చించాల్సి వస్తోంది. మొన్నటిదాకా రూ.10కి పావుకిలో వచ్చేదని వినియోగదారులు వాపోతున్నారు.
 
బీరకాయ, బెండకాయలతో పాటు పచ్చిమిర్చి ధరలు కూడా పెరిగాాయి. మిగతా కూరగాయల ధరలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. ఏది కొనాలన్నా పావుకిలోకు తక్కువలో తక్కువ రూ.10 వెచ్చించాల్సిందే. నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకు సరిపడా కూరగాయలు కొనాలంటే కనీసం రూ.50 ఖర్చు చేయాల్సిందే. పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, పాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు కూరగాయల ధరలు కూడా ఇలా పెరుగుతూ పోతే తాము ఏం తిని బతకాలంటూ.. ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈరోజుల్లో బతకడమే కష్టమవుతోందని వాపోతున్నారు.  కూరగాయ ల ధరలను అదుపులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు