ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచండి 

19 Jan, 2019 02:21 IST|Sakshi

‘రిజర్వేషన్ల’ పెంపు నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచా లని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ)ల చైర్మన్లతోపాటు అన్ని రాష్ట్రాల సీఎస్‌ లకు ఎంహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ స్మితా శ్రీవాత్సవ లేఖలు రాశారు. కేంద్రం రిజర్వేషన్లు పెంచిన నేపథ్యంలో దేశంలోని సెంట్రల్‌ వర్సిటీలు, ఎన్‌ఐటీ, ఐఐటీల వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు, రాష్ట్ర విద్యా సంస్థల్లో సీట్లను పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న సీట్లు, రిజర్వేషన్లకు ఇబ్బందులు తలెత్తకుండా సీట్ల పెంపునకు చర్యలు చేపట్టాలని, మార్చి 31లోగా దీన్ని పూర్తి చేయాలన్నారు. 

వీటికి సీట్ల పెంపు వర్తించదు..: ఈ సీట్ల పెంపు ఉత్తర్వులు 8 జాతీయస్థాయి సంస్థలైన హోమీబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, దాని పరిధిలోని 10 యూనిట్లు, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్, నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరాగాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్స్, నేషనల్‌ బ్రెయిన్‌ రీసెర్చ్‌ సెంటర్, జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్, ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ, స్పేస్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌లకు వర్తించబోవని ఎంహెచ్‌ఆర్‌డీ స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు