జిల్లా ఆసుపత్రుల ఆధునీకరణ 

29 May, 2019 01:56 IST|Sakshi

కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాటైన ఆస్పత్రుల్లో పడకల పెంపు

ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం

జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి నిధుల కేటాయింపు  

సాక్షి, హైదరాబాద్‌: నూతన జిల్లాల్లో ఏర్పాటైన జిల్లా ఆసుపత్రులను ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలు ఏర్పాటయ్యాక ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా మార్పు చేశారు. అయితే పేరు మారిందే కానీ ఆ మేరకు వాటి స్థాయిని పెంచలేదు. పడకలు, పరికరాలు, ఇతరత్రా వసతుల ఏర్పాటు జరగలేదు. ఈ పరిస్థితిని సమగ్రంగా మార్చాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీంతో కొత్తగా ఏర్పాటైన జిల్లా ఆస్పత్రుల దశ మారనుంది. తొలి దశలో ములుగు, నారాయణపేట, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, గద్వాల్‌ జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఈ తొమ్మిది ఆసుపత్రుల్లో భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం వసతులు సమకూర్చుతారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 50 నుంచి 100 పడకలు మాత్రమే ఉన్నాయి. వాటిని 250కి పెంచనున్నారు. అలాగే జిల్లా ఆసుపత్రుల్లో జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, అనెస్థీషియా, పీడియాట్రిక్‌ తదితర విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. వాటన్నింటినీ ఈ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తారు. ఆ ప్రకారం వైద్యులను కూడా నియమిస్తారు. అందుకోసం వైద్యుల భర్తీ ప్రక్రియ కూడా జరగనుంది. క్రిటికల్‌ కేర్, ఎమర్జెన్సీ యూనిట్, అంబులెన్స్, ఆపరేషన్‌ థియేటర్లను అందుబాటులోకి తీసుకొస్తారు. అలాగే రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సిటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్, ఈసీజీ, ఎక్స్‌రే, ఎండోస్కోపి తదితర అన్ని డయాగ్నస్టిక్స్‌ యంత్రాలు సమకూరుస్తారు. 

ఒక్కో ఆస్పత్రికి 60 కోట్లు 
జిల్లా ఆస్పత్రుల అభివృద్ధికి జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులు కేటాయించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ముందుకొచ్చినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 3 దశల్లో రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రులను ఆధునీకరిస్తారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాక, ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా ఆధునీకరించారు. అయితే ఆ మేరకు వసతులేవీ కల్పిం^è లేదు. దీంతో పాత జిల్లా కేంద్రాల్లోని దవాఖానాలకే రోగులు వెళ్తున్నా రు. ఈ దవాఖానాల అభివృద్ధికి ఎన్‌హెచ్‌ఎం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు కోరుతూ వస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం, పలు విభాగాల ఏర్పాటు తదితర అవసరాలకు ఒక్కో ఆస్పత్రి కి రూ.60 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించినట్టు చెబుతున్నారు. మొత్తం 3 దశల్లో నూతన జిల్లాల్లోని ఆసుపత్రులను ఆధునీకరిస్తారు. ముందుగా తొమ్మిది ఆసుపత్రులు ఆధునీకరణకు నోచుకోనున్నాయి.   

మరిన్ని వార్తలు