పెరిగిన నీలి కిరోసిన్‌ ధర

8 Aug, 2018 14:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెరిగిన నీలి కిరోసిన్‌ ధర

రేషన్‌ షాపుల్లో లీటర్‌కు రూ.27

రెండేళ్లలో రూ.12 పెరుగుదల

జిల్లాలో నెలకు 2,31,580 లీటర్ల కిరోసిన్‌ వినియోగం

నిరుపేదలపై అదనపు భారం

తొర్రూరు రూరల్‌(పాలకుర్తి): రేషన్‌ దుకాణాల్లో నీలి కిరోసిన్‌ ధర పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడింది. కిరోసిన్‌ను అధిక శాతం నిరుపేదలే వినియోగిస్తుంటారు. ధరలు పెరగడంతో కిరోసిన్‌ కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేదలను కిరోసిన్‌ ధర మరింత కుంగదీస్తోంది. నెలన్నర క్రితం లీటర్‌కు రూ.15 నేడు రూ.27కు చేరుకుంది.

ప్రజలపై రూ. 27.78లక్షల భారం

జిల్లాలో 553 రేషన్‌ దుకాణాలు, 2,31,580 కార్డులు ఉన్నాయి. ఒక్కో రేషన్‌ కార్డుకు లీటరు చొప్పున కిరోసిన్‌ ఇస్తున్నారు. రెండేళ్లలో అదనంగా రూ.12 పెంచడంతో ప్రజలపై రూ.27.78లక్షల భారం పడుతోంది. పెరిగిన ధరలతో కిరోసిన్‌ కొనుగోలు చేయలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రైవేటు మార్కెట్‌లో లీటర్‌ కిరోసిన్‌ ధర రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. ధరలతో ప్రైవేటులో, రేషన్‌ దుకాణాల్లో కొనలేని పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు. గత ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేది. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్‌ మాత్రమే ఇస్తున్నారు. బియ్యం ధర అందుబాటులో ఉన్నప్పటికీ కిరోసిన్‌ ధర కూడా తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు.

కిరోసిన్‌ ధర తగ్గించాలి

లీటర్‌ కిరోసిన్‌ రూ.27కు కొనాలంటే కష్టంగా ఉన్నది. అంతకుముందు రూ.15కు పోసేవాళ్లు. గ్యాస్‌ పొయ్యి కొనే స్థోమత లేదు. కిరోసిన్‌ స్టవ్‌ పెట్టుకుందామంటే దాని ధర కూడా పెరిగింది. ప్రభుత్వం ఆలోచించి ధర తగ్గించాలి.

– గుగులోతు బీకి, గుడిబండ తండా, తొర్రూరు 

సామాన్యులపై భారం పడుతోంది

రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఒక్క కార్డుకు లీటరు కిరోసిన్‌ మాత్రమే ఇస్తోంది. రెండు, మూడు నెలలకోసారి ధరలు పెంచుతున్నారు. దీంతో మాపై భారం పడుతుంది. గతంలోమాదిరి పప్పు, చింతపండు, చక్కర, తదితర వస్తువులు ఇవ్వాలి.

– దండె సురేష్, ఫత్తేపురం, తొర్రూరు 

ప్రభుత్వ ఆదేశాల మేరకే..

ప్రభుత్వ ఆదేశాల మేరకే కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే అలాగే డీలర్లకు సరఫరా చేస్తున్నాం. కిరోసిన్‌ ధరలు తగ్గించాలని ఉన్నతాధికారులను కోరతాం.

– జి.నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి  

మరిన్ని వార్తలు