ఎంచక్కా.. ఎగిరిపోదాం..!

20 Apr, 2019 04:55 IST|Sakshi

విమాన ప్రయాణాలపై హైదరాబాదీల ఆసక్తి 

ఆకట్టుకునే ప్యాకేజీలు.. అందుబాటులోనిచార్జీలే కారణం

ఇటు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పెరిగిన కనెక్టివిటీ 

విదేశాల్లో 18 నగరాలు, దేశంలోని 66 నగరాలకు సర్వీసులు

మామూలు రోజుల్లో సగటున 55 వేల మంది ప్రయాణం..  

వేసవి కావడంతో అదనంగా 15 వేల మంది వరకు ప్రయాణాలు  

అందుబాటులో ఉండే విమాన చార్జీలు మరోవైపు.. వెరసి హైదరాబాదీలను జాతీయ, అంతర్జాతీయ నగరాల్లో పర్యటించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలసి ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారు. కొద్దిరోజులుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

సాధారణ రోజుల్లో ప్రతిరోజూ సుమారు55 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా ఇప్పుడు 10 వేల నుంచి 15 వేల మంది అదనంగా బయలుదేరి వెళ్తున్నట్లు అంచనా. అన్ని విమానాల్లో చాలా వరకు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వేసవి రద్దీయే ఇందుకు కారణమని విమానాశ్రయ అధికారవర్గాలు తెలిపాయి. 
                     
విస్తరించిన సేవలు
హైదరాబాద్‌ నుంచి అన్ని ప్రాంతాలకు ఫ్లైట్‌ కనెక్టివిటీ విస్తరించుకుంది. ప్రస్తుతం దేశంలోని 66 నగరాలకు, విదేశాల్లో 18 నగరాలకు హైదరాబాద్‌ నుంచి విమానాలు నడుస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏటా 20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకొనే ప్యాకేజీలు సైతం విమాన ప్రయాణాలను బాగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో గత రెండేళ్లుగా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య 16 లక్షల నుంచి 20 లక్షల వరకు పెరిగింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకలు, వరుస సెలవులు, వేసవి లాంటి సమయాల్లో ప్రయాణికులు  ఎక్కువ శాతం విమాన ప్రయాణాలనే ఎంపిక చేసుకుంటున్నారు. 

ఈ నగరాలంటే మక్కువ ఎక్కువ
నగరవాసులు ఎక్కువగా సింగపూర్, మలేసియా, మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్, లండన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలకు తరలివెళ్తున్నారు.అందుబాటులో ఉండే  చార్జీలు ఒక కారణమైతే ఈజీ కనెక్టివిటీ మరో ప్రధాన కారణం. నేరుగా ఫ్లైట్‌ సర్వీసులు అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువమంది ఈ దేశాలకు వెళ్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణమే. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున పర్యాటకులు ఎక్కువ శాతం  సింగపూర్, మలేషియాలను ఎంపిక చేసుకుంటున్నారు.

రైలు చార్జీలతో సమానం
దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు శంషాబాద్‌ నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో చాలామంది రైలు ప్రయాణం కంటే విమాన ప్రయాణానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. చార్జీల్లోనూ ఈ మార్పు కన్పిస్తోంది.సెకండ్‌ క్లాస్‌ ఏసీ ట్రైన్‌ చార్జీలతో సమానమైన విమాన చార్జీలు, క్షణాల్లో గమ్యస్థానానికి చేరే అవకాశముండటంతో విమాన సర్వీసుల వైపు ఆసక్తిని పెంచుతున్నాయి. ఎక్కువ మంది బెంగళూర్, ఢిల్లీ, గోవా, ముంబై, చెన్నైతో పాటుగా ఇటు బ్యాంకాక్, నేపాల్, బ్రిటన్, అమెరికాలాంటి ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. మరికొందరు వేసవి సెలవులను ఎంజాయ్‌ చేసేందుకు సోలోగా ఫ్లైట్‌ ఎక్కేస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి సుమారు 25 శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్‌ ఏజెన్సీలు తెలిపాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌లు సైతం బాగా పెరిగినట్లు థామస్‌కుక్, కాక్స్‌ అండ్‌ కింగ్స్, ఐఆర్‌సీటీసీ.. తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. 

సోలోగా అయితేనే సో బెటర్‌
హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. సుమారు 28 శాతం ఇలా ఒంటరిగా విదేశీటూర్లకు వెళ్తున్నట్లు ఓ అంచనా. తమకు నచ్చిన పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరబందీల్లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడం వల్ల చాలా మంది సోలో జర్నీయే సో బెటర్‌ అనుకుంటున్నారు. ఎక్కువ మంది బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. ఇటు దేశంలో బెంగళూర్, గోవా, జైపూర్, కొచ్చి, గౌహతి, విశాఖ నగరాలకు సోలో పర్యాటకుల ఎక్కువగా ఉంది. 

అత్యాధునిక సేవలు..
భద్రతా తనిఖీలను క్షణాల్లో పూర్తిచేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికులకు అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన ‘ప్యాసింజర్‌ ప్రైమ్‌’ సర్వీసులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే ఎక్కడా ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పారదర్శకమైన  భద్రతా తనిఖీలను కొనసాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికుల కోసం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్‌ రికగ్నేషన్, హ్యాండ్‌ బ్యాగేజ్‌ స్కానింగ్‌లతో క్షణాల్లో తనిఖీలను పూర్తి చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు