సర్కారు ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు

3 Aug, 2017 22:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత ఆరు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రసవాల సంఖ్య 33 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 82 శాతం, మేడ్చల్‌ జిల్లాలో తక్కువగా ఐదు శాతం ప్రసవాలు నమోదయ్యాయని చెప్పారు. కేసీఆర్‌ కిట్ల పథకం అమలు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై అన్ని జిల్లాల జిల్లా వైద్యాధికారులతో మంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రసవాలు జరిగిన జిల్లాల్లో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రసవాల సంఖ్య 2017 జనవరిలో 33 శాతం, ఫిబ్రవరిలో 30 శాతం, మార్చిలో 35 శాతం, ఏప్రిల్‌లో 39 శాతం, మేలో 40 శాతం, జూన్‌లో 41 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం అమలు తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగిందని చెప్పారు.

మరిన్ని వార్తలు