ఉద్వేగం.. ఉత్కంఠ..

7 Dec, 2018 01:26 IST|Sakshi

అశ్వారావుపేట, పినపాక, భద్రాచలంపై సర్వత్రా ఆసక్తి 

ఏపీలో 7 మండలాల విలీనంతో భారీగా తగ్గిన ఓటర్లు  

అతిచిన్న నియోజకవర్గంగా భద్రాచలం 

ఓటర్లు తగ్గడంతో ప్రతీ ఓటుకు పెరిగిన ప్రాధాన్యం 

ప్రచారం చేసిన ఆ ఏడు మండలాల నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: మొన్నటిదాకా స్థానికులంతా కేంద్రం నిర్ణయంతో స్థానికేతరులయ్యారు.. అయినా సరే విడిపోయామన్న ఉద్వేగం తో వచ్చి ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లు భారీగా తగ్గడంతో నేతలంతా గుబులు చెందుతున్నారు. పోలింగ్‌ రోజు నుంచి ఫలితాలు వెల్లడయ్యేదాకా వీరి ఉత్కంఠ రెట్టింపు కానుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకు ఇక్కడే ఉన్న వారంతా అనివార్య కారణాల వల్ల తెలంగాణలోని ఏడు మండలాల ప్రజలు ఏపీలో విలీనమయ్యారు. ఈ ప్రాంతాల్లో దాదాపు లక్షన్నర ఓట్లున్నాయి. ఓటర్ల సంఖ్య భారీగా తగ్గడంతో మూడు నియోజకవర్గాల్లో ప్రతీ ఓటు కీలకంగా మారింది. అభ్యర్థులు ప్రతీ ఓటరును వ్యక్తిగతం గా కలిసి మరీ ఓటేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో ఓట్లు 1.3 లక్షలే కావడంతో ఇక్కడ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రయత్నిస్తున్నారు. 

ఇదీ నేపథ్యం.. 
ఏపీ అభ్యర్థన మేరకు అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాలను కేంద్రం ఏపీలో కలిపింది. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక పరిధిలోని బూర్గంపాడు, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిల్లో 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలున్నాయి. మొత్తం 1.8 లక్షల ఓట్లు ఏపీకి బదిలీ అయ్యాయి. 

భద్రాచలంలో ప్రత్యేక ప్రచారం.. 
ఈ నియోజకవర్గాల్లో అన్నింటి కంటే ఎక్కువగా ఓటర్లను కోల్పోయింది భద్రాచలం. దాదాపు 1,35,000 ఓట్లు ఏపీకి బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ ఇక్కడ పోటీని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. టీఆర్‌ఎస్, మహాకూటమితో పాటు, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్న 1.37 లక్షల ఓట్లను ముగ్గురు అభ్యర్థులు పంచుకోగా విజేతకు ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై బెట్టింగులు కూడా మొదలయ్యాయి. సంఖ్య పరంగా చూస్తే ఇదే అతిచిన్న నియోజకవర్గం కావడం గమనార్హం. మరోవైపు అశ్వరావుపేటలో 1.6 లక్షల ఓట్లలో 42 వేల ఓట్లు ఏపీకి బదిలీ కాగా, ఈసారి కొత్త ఓటర్లతో కలిపి 1.4 లక్షలకు రావడం గమనార్హం. పినపాక దాదాపు 4 వేల ఓట్లు కోల్పోయింది. 

గట్టుదాటి ప్రచారం! 
గత ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి, ఓట్లు వేసిన ముంపు ప్రాంతాల ప్రజలు అనూహ్యంగా ఏపీలో కలిశారు. ఇందులో ప్రజలకు ఓటు వేసే వీలు లేకుం డా పోయింది. కానీ దాదాపు అన్ని పార్టీల నేతలూ అక్కడ ఉన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో వీరంతా ప్రచారం చేసేందుకు గట్టు దాటి వచ్చారు. దాదాపు అన్ని పార్టీల నేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేశారు. తమ తమ పార్టీల విజయాల కోసం కష్టపడ్డారు. ఈ నెల 5న ప్రచార గడువు ముగియడంతో ఇక సెలవంటూ ఉద్వేగంతో తిరుగు పయనమయ్యారు. 

మరిన్ని వార్తలు