అతివలు.. అదుర్స్‌

13 Dec, 2018 01:29 IST|Sakshi

మహిళల్లో పెరిగిన ఉద్యోగ నైపుణ్యాలు 

38 శాతం నుంచి 45 శాతానికి పెరుగుదల

ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌లో రాష్ట్ర విద్యార్థులకు రెండో స్థానం 

ఇండియా స్కిల్‌ రిపోర్టు–2019లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్‌ రిపోర్టు–2019 స్పష్టం చేసింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల స్థితిగతులపై నివేదికలో అంచనా వేశాయి. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100కు పైగా కంపెనీలు, 3.1 లక్షల మంది విద్యార్థులను కలిశాయి. గతంతో పోలిస్తే ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 2014 సంవత్సరం నివేదిక ప్రకారం అప్పట్లో 30.3 శాతం పురుషుల్లో ఉద్యోగ నైపుణ్యాలు ఉంటే, 42.1 శాతం మంది మహిళల్లో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య మధ్యలో తగ్గిపోయింది. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన పురుషుల సంఖ్య 47.39 శాతానికి క్రమంగా పెరుగుతూ రాగా, 2015లో నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య 37.88 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత 2016, 2017 నివేదిక ప్రకారం ఆ రెండేళ్లలో పెరిగినా 2018 నివేదిక ప్రకారం 38.15 శాతానికి తగ్గిపోయింది. ఏడాది మళ్లీ పుంజుకుందని, 45.6 శాతానికి నైపుణ్యాలున్న మహిళల సంఖ్య పెరిగిందని తాజా నివేదికలో వివరించింది.  

ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌లో రెండో స్థానం 
సబ్జెక్టుల్లోని పరిజ్ఞానంతో పాటు ఇతర నైపుణ్యాలనూ అధ్యయనం చేసింది. రాష్ట్రాల వారీగా విద్యార్థులు స్థితిగతులను అంచనా వేసింది. నేర్చుకునే సామర్థ్యాలు (లెర్నింగ్‌ ఎబిలిటీ), విషయ స్వీకరణ సామర్థ్యం (అడాప్టబిలిటీ), ఇతరులతో భావవ్యక్తీకరణ సామర్థ్యాలు (ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌), భావోద్వేగ మేధస్సు (ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌), సంక్షోభ పరిష్కార సామర్థ్యం, స్థిర దృక్పథం అంశాలపై అధ్యయనం చేసింది. ఇందులో తెలంగాణ విద్యార్థులు భావోద్వేగ మేధస్సు, కాన్‌ఫ్లిక్ట్‌ రిజల్యూషన్‌లో రెండో స్థానంలో నిలవగా, లెర్నింగ్‌ ఎబిలిటీలో 7వ స్థానం, అడాప్టబిలిటీ, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌లో 8వ స్థానం, సెల్ఫ్‌ డిటర్మినేషన్‌లో 6వ స్థానంలో నిలిచారు.  

పనిలో భాగస్వామ్యం పెరగాలి.. 
పనిలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం పనిలో పురుషుల భాగస్వామ్యం 75 శాతం, మహిళల భాగస్వామ్యం 25 శాతం ఉంది. పట్టణాల్లో 68.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 67శాతం డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ‘పెయిడ్‌ జాబ్స్‌’లేవని పేర్కొంది. 

మరిన్ని వార్తలు