పెరగనున్న పాఠ్య పుస్తకాల ధరలు!  

14 Dec, 2018 00:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల పాఠ్య పుస్తకాల ధరలు పెరగనున్నాయి. పేపర్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో పుస్తకాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పాఠ్య పుస్తకాలకు ఉపయోగించే పేపరు టన్నుకు రూ.5 వేల వరకు అదనంగా ధర పెరిగిందని, దీంతో పుస్తకాల ధరలు 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు అందించే పుస్తకాలపై పెరిగే ధరలను ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే మరో 30 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై మాత్రం భారం పడనుంది. పెరిగిన ధరల మేరకు పబ్లిషర్లు ధరలను పెంచే అవకాశం ఉండటంతో ఆ మేరకు తల్లిదండ్రులపైనా భారం తప్పేలా లేదు. ఇక పుస్తకాల ముద్రణకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించామని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లభించగానే టెండర్లను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు