తెగిన ఆ‘దారం’

22 Dec, 2014 02:57 IST|Sakshi
తెగిన ఆ‘దారం’

మగ్గాలపై నేసే వస్త్రాలు బాగుంటాయి. వాటిని వాడడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని మగ్గంపై నేసే క్రమంలో వచ్చే దుమ్ము, ధూళి కార్మికుల టీబీ, దగ్గు, దమ్ము, జ్వరం వంటి అనేక రోగాలు తెచ్చి పెడుతోంది. చేనేత కార్మికులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి. కార్మికుల పిల్లలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేయాలి. అప్పుడే చేనేత రంగానికి చేయూతనిచ్చిన ప్రభుత్వంగా పాలకులకు పేరుంటుంది. మాకు బతుకుపై ధీమా ఉంటుంది.
 - కల్యాణపు
 కనుక శ్రీను
 
 సంఘం ప్రత్యేకతలు
కరీంనగర్ మండలం కొత్తపల్లి చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌ను 1949లో స్థాపించారు. సభ్యులు గతంలో 700మంది ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 215కి పడిపోయింది. అందులో 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తువ్వాలలు, లుంగీలు, చెద్దర్లు, డోర్ కర్టన్స్, పాలిస్టర్ షర్టింగ్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉత్పత్తి చేస్తారు. సంఘానికి బ్యాంకు అప్పు రూ.15 లక్షలు ఉండగా ఆప్కోనుంచి రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వస్త్రాల నిల్వ రూ.45 లక్షలు, నూలు స్టాకు నిల్వ రూ.25 లక్షలు, రంగు రసాయనాల నిల్వ రూ.2 లక్షలు ఉన్నట్లు సమాచారం.
 
 రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని మగ్గం నేసినా కడుపు నిండని దైన్యం వారిది. బట్టలు నేసి నాగరికతకు రూపం తెచ్చిన నేతన్నల ఒంటిపై చిరుగు బట్టలే దర్శనమిస్తూ వారి దుస్థితికి అద్దం పడుతున్నాయి. పనిచేస్తే డబ్బులతోపాటు బోనస్‌గా వచ్చే రోగాలు ఆ డబ్బునంతా హరిస్తున్నాయి.
 
 ప్రభుత్వ పథకాలేవీ వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించినా వారసత్వంగా వచ్చిన వృత్తిపై మమకారం చంపుకోలేక  ఇప్పటికీ ఉపాధి కోసం ముంబయి, భీవండి బాటపడుతూ బతుకుబండి లాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేత కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారి వారి సమస్యలను తెలుసుకున్నారు. కరీంనగర్ మండలం కొత్తపల్లి చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌లో కార్మికులతో మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు