జీవన దాతలకోసం...ఎదురుచూపులే!

9 Dec, 2019 03:43 IST|Sakshi

అవయవ మార్పిడికి పెరుగుతున్న డిమాండ్‌

దాతలు లేక అనేకమంది ఎదురుచూపు

దాదాపు పావు వంతు మందికే అందుబాటు

ఏడేళ్లలో 7,126 బాధితుల్లో 1,953 మందికే లభ్యత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అవయవ మార్పిడి అవసరమైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ చేయించు కున్న వారితో పోలిస్తే, అవయవాల లభ్యత దాదాపు పావు వంతు వరకే ఉంటుంది. దీంతో అవయవ మార్పిడికి నోచుకోక అనేక మంది దీర్ఘకాలిక చికిత్సతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

కొందరైతే చికిత్స మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు మరింత పెరుగుతు న్న సంగతి తెలిసిందే. వారికి అవయవాలను మార్పిడి చేసేందుకు అవకాశాలు దక్కడంలేదు. ఈ పరిస్థితిపై ఇటీవల గవర్నర్‌కు ఇచ్చిన నివేదికలో వైద్య, ఆరోగ్యశాఖ పలు వివరాలు వెల్లడించింది.

వెయిటింగ్‌ లిస్టులో 5,173 మంది.. 
రాష్ట్రంలో కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అటువంటి వారిని రక్షించుకోవాలం టే సాధారణ చికిత్సలతోపాటు అవయవ మార్పిడి అవసరం. దేశంలో మొన్నటి వరకు అత్యంత ఎక్కువ అవయవ మార్పిడి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానా న్ని మహారాష్ట్ర దక్కించుకుంది.

దేశంలో ఏటా 5 లక్షల మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. 10 లక్షల మందికి 0.8 అవయవ దానం రేటు ఉండగా, తెలంగాణలో ఆ రేటు నాలుగుగా ఉంది. 2013 నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 7,126 మంది జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా,1,953 మందికి మాత్రమే మార్పిడి జరిగింది. 5,173 మంది బాధితు లు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారని వైద్యారోగ్య శాఖ ఆ నివేదికలో తెలిపింది.

ట్రామాకేర్‌ సెంటర్ల లేమి.. 
అవయవ మార్పిడి రెండు రకాలుగా జరుగుతుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు అవయవాలను సేకరిస్తారు. బతికుండగా బంధువుల సమ్మతి మేరకు కిడ్నీ, లివర్‌ వంటివి సేకరిస్తారు. ఇతర దేశాల్లో గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి కూడా అవయవాలను సేకరిస్తారు. మన దేశంలో గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి అవయవాలను సేకరిం చట్లేదు. ఎందుకంటే గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి 20 నిమిషాల్లోనే అవయవాలను సేకరించాలి.

అంత తక్కువ సమయంలో సేకరించే వ్యవస్థ, మౌలిక సదుపాయాలు మన వద్ద లేవని పలువురు అంటున్నారు. అవయవాల సేకరణకు మనకున్న మార్గాలు బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి లైవ్‌గా సేకరించడమే. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో ఎక్కువ మంది బ్రెయిన్‌ డెడ్‌కు గురవుతారు. జాతీయ రహదారుల వెంట మనకు ట్రామాకేర్‌ సెంటర్లు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లేలోగా వారు చనిపోతున్నారు.

ట్రామాకేర్‌ సెంటర్లలో ప్రమాదాలకు గురైన వారికి వైద్యం చేసి బతికించే అవకాశం ఉంటుంది. లేదా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి అవయవా లు సేకరించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరి నుంచైనా అవయ వాలు సేకరించాలంటే చాలామంది ముందుకు రావడంలేదు. వీటి వల్ల తెలంగాణలో చాలామంది అవయవ మార్పిడి చికిత్స అందక మరణిస్తున్నారు.

అవయవ మార్పిడికి డిమాండ్‌ పెరిగింది
అవయవ మార్పిడికి రాష్ట్రం లో డిమాండ్‌ పెరిగింది. కానీ ఆ మేరకు అం దించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్‌ చేయించుకుంటున్నా రు. అయినా అనేక మంది ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం లేదు. అవకాశం లేదనో, అవగాహన లేకనో జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం లేదు. రాష్ట్రంలో లక్ష మంది అవయవదాన ప్రతిజ్ఞ చేశారు.
– డాక్టర్‌ స్వర్ణలత, జీవన్‌దాన్‌ ఇన్‌చార్జి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు