గోదావరి గలగల.. కృష్ణమ్మ కళకళ

14 Aug, 2018 02:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భారీ వర్షాలతో పెరుగుతున్న వరద 

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4.35 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

మిగులు జలాలను విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) దిగువ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వరకూ గోదావరి నిండుగా ప్రవహిస్తుంటే, పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4,35,061 క్యూసెక్కుల గోదావరి వరద నీళ్లు సముద్రంలోకి వదిలితే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, కడెం, ర్యాలీ, గొల్లవాగులు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని, సీలేరు వంటి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తేసి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని, తాలిపేరు నదు ల నుంచి వరద భారీగా వస్తోండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి వచ్చిన వరదను కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న జలాలను విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. 

నేడు పలుచోట్ల భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో మంగళవారం ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు