నేటి నుంచి గాంధీలో నిరవధిక సమ్మె

15 Jul, 2020 05:23 IST|Sakshi
మంగళవారం గాంధీ ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

డిమాండ్లు తీర్చే వరకు ఆందోళన ఆగదు 

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వెల్లడి 

మంగళవారం గాంధీలో విధుల బహిష్కరణ 

రోడ్డుపై బైఠాయింపు.. ఇబ్బందులు పడ్డ రోగులు 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఆస్పత్రి వర్గాలు 

గాంధీ ఆస్పత్రి: కోవిడ్‌–19 నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి నిరసన సెగ తగిలింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ ప్రతినిధులతోపాటు గాంధీ సిబ్బంది జేఏసీ నిర్ణయించింది.

ఈ మేరకు మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్‌ ప్రధాన డిమాండ్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం నినాదంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్‌ సిబ్బంది గత 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.  

మమ్మల్ని పట్టించుకోవట్లేదు..: ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు రూ.34 వేల వేతనం, ఇన్‌సెంటివ్స్, బీమా సౌకర్యం కల్పించాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కాంట్రాక్టు నర్సింగ్‌ యూనియన్‌ ప్రతినిధులు సుజాతరెడ్డి, మేఘమాల, ఇందిర, సరళ, మధులతలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ‘నాల్గవ తరగతి ఉద్యోగులను, 300 ఓసీఎస్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌ టేకర్ల వేతనాలు రూ.20 వేలకు పెంచాలి’అని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఐఎన్‌టీయూసీ గాంధీ యూనిట్‌ అధ్యక్షుడు శివకుమార్‌ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, నిరవధిక సమ్మె విషయం తన దృష్టికి రాలేదని గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. 

బెడ్లపైనే మృతదేహాలు.. 
డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, పేషెంట్‌ కేర్‌ టేకర్లు మంగళవారం మూకుమ్మడిగా విధులు బహిష్కరించడంతో చికిత్స పొందుతున్న సుమారు 900 మంది కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్డుల్లో పారిశుధ్య లోపంతో తీవ్ర దుర్వాసనల మధ్య వైద్యులు విధులు నిర్వహించారు. చికిత్స పొందుతూ మరణించిన రోగుల మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు అవకాశం లేకపోవడంతో గంటల తరబడి బెడ్లపైనే పడున్నాయి.  

మరిన్ని వార్తలు