‘బంగారు హైదరాబాద్‌’ మన లక్ష్యం

16 Aug, 2018 09:07 IST|Sakshi
జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ యోగితా రాణా, ఇన్‌చార్జి జేసీ శ్రీవత్స తదితరులు  

పంద్రాగస్టు వేడుకల్లో కలెక్టర్‌ యోగితారాణా

సాక్షి,సిటీబ్యూరో : ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడంలో అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను బంగారు హైదరాబాద్‌గా తీర్చిదిద్దుదామని కలెక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా  కలెక్టరేట్‌లో 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  జాతీయ జెండాను ఎగురవేసి కలెక్టర్‌ ప్రసంగించారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అనేక మంది ప్రాణ త్యాగం చేశారని, ఇప్పుడు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రజలకు చేరవేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో భాగస్వాములవ్వాలని సూచించారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి అర్హులందరూ  లబ్ధి పొందేలా చూడాలన్నారు. బేటి బచావో–బేటి పడావో కార్యక్రమం అమలుతో హైదరాబాద్‌ను సేఫ్‌ సిటీగా తీర్చిదిద్ది జాతీయ అవార్డు సాధించామన్నారు.  

అవార్డు గ్రహీతలకు ప్రశంసలు 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకున్న అధికారులు, ఉద్యోగులను మరింత ప్రోత్సహించే విధంగా విధి నిర్వహణ, వ్యక్తిగత పనితీరుపై కలెక్టర్‌ యోగితా రాణా పేరుపేరునా ప్రశంసలు కరిపించారు. అవార్డు స్ఫూర్తితో ప్రజలకు సేవలందించేందుకు మరింతగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్, రెడ్‌ క్రాస్, ఎన్జీఓలకు కూడా కలెక్టర్‌ ప్రశంసా పత్రాలు అందజేశారు.

అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఇంచార్జి జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవత్స కోటæ, డీఆర్వో రాధిక రమణి, పరిపాలనాధికారి జానికి, డీఈఓ వెంకటనర్సమ్మ,  డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటి, డీఐఓ నాగార్జున, జిల్లా గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ యాదవ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు