కళాదీప్తి.. భళాకీర్తి  

16 Aug, 2018 13:17 IST|Sakshi
దేశభక్తి గేయానికి రేడియంట్‌ పాఠశాల విద్యార్థుల ప్రదర్శన 

వనపర్తి క్రైం: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోని పరేడ్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలను తిలకించేందుకు పట్టణ ప్రజలు భారీగా తరలొచ్చారు. సమరయోధులు కడుకుంట్ల వేణయ్య, వెంకటాపురం నారాయణరెడ్డిని నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ శ్వేతామహంతి శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

కొత్తకోట మండలం ఉల్లెంకొండ రాజాబహద్దూర్‌ వెంకట్రామిరెడ్డి పాఠశాల విద్యార్థులు బోనాలు, బతుకమ్మ, ఆర్మీ జవాన్‌ వేషధారణతో ప్రదర్శన ఇచ్చారు. అలాగే వనపర్తి రేడియంట్‌ పాఠశాల విద్యార్థులు రైతుల కష్టసుఖాలు, దేశం భక్తి ఉట్టిపడేలా జయహో అనే పాటతో కళ్లకు కట్టినట్లు చూపించారు. వనపర్తి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పారు.

వనపర్తి కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు గిరిజన జానపద గేయంపై కళాప్రదర్శన ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. పాన్‌గల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు తిరోక్క పూలతో బతుకమ్మను తయారుచేసి పల్లె వాతావరణాన్ని రంజింపజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో మువ్వన్నెల పతకాలను ప్రదర్శించారు. సంబరాలు ముగిసే వరకు జయహో..జయహో భారత్‌ అంటూ జనాలు నినాదాలు చేశారు.

వైభవంగా పంద్రాగస్టు సంబరాలు 

వనపర్తి అర్బన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు బుధవారం పట్టణంలోని జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జె.శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రామ్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శివశంకర్, చంద్రశేఖర్, సిబ్బంది మద్దిలేటి, సాయిరెడ్డి, శ్రీనివాస్‌జీ, నర్సింహరావు, వెంకటయ్యతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ రవూఫ్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నియోజవర్గ ఇన్‌చార్జ్‌ జింకల కృష్ణయ్య జెండాను ఎగరవేశారు.  

>
మరిన్ని వార్తలు