నిలిచేదెవరు..? తప్పుకునేదెవరు..?

22 Nov, 2018 10:52 IST|Sakshi

     అసంతృప్తులను బుజ్జగిస్తున్న నాయకులు 

     అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు 

     అధికారికంగా ప్రకటించాలంటున్న రెబెల్స్‌ 

     నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు 

     కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఆందోళన 

పార్టీ టికెట్టు కేటాయించకపోవడంతో అలిగి స్వతంత్రంగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్‌ నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇతర అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోవారు అధిష్టానం మాట విని తప్పుకుంటారా? బరిలోనే ఉంటారా అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగియనుండడంతో కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. 

సాక్షి, కామారెడ్డి: టికెట్టు దక్కలేదన్న కోపంతో తిరుబాటుకు సిద్ధపడ్డ నేతలను కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జగిస్తోంది. ముందుముందు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని, పోటీకి అవకాశం కల్పిస్తామని, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఆశచూపుతోంది. పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తోంది. అయితే తమకు ఏ పదవి ఇస్తారో అధికారికంగా ప్రకటిస్తేనే పోటీ నుంచి తప్పుకుంటామని తిరుబాటు నేతలు మొండికేస్తున్నట్టు సమాచారం. దీంతో వారిని ఒప్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  
మూడు చోట్లా రెబెల్స్‌.. 
జిల్లాలో ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాట్లు లేవు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు టికెట్టు కోసం ప్రయత్నించారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన జాజాల సురేందర్‌కు అవకాశం దక్కింది. దీంతో భంగపడ్డ సుభాష్‌రెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. బాన్సువాడలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు కాసుల బాల్‌రాజును వరించింది. ఇక్కడ టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన మల్యాద్రిరెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జుక్కల్‌లో గంగారామ్‌కు టికెట్టు రావడంతో అరుణతార 
తిరుగుబాటు చేశారు. ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని భావించారు. అయి తే అనూహ్యంగా బీజేపీలో చేరిన అరుణతార ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.  
రంగంలోకి హైకమాండ్‌.. 
తిరుగుబాటు చేసిన నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌ కేంద్రంగా తిరుగుబాటు నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఎల్లారెడ్డిలో తిరుగుబాటు చేసిన సుభాష్‌రెడ్డికి ఎంపీ టికెట్టు ఇస్తామని నేతలు చెప్పినట్లు తెలిసింది. అయితే పార్టీ నుంచి అధికారికంగా ప్రకటించాలని ఆయన మెలిక పెట్టినట్టు సమాచారం. ఎంపీ అవకాశం ఇస్తామని కచ్చితంగా ప్రకటిస్తేనే తాను పోటీ నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలవడంతో ఆయ నతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు మాట్లాడినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.  
నేటితో ముగియనున్న గడువు.... 
నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గడువులోగా తిరుగుబాటు నేతలు నామినేషన్లను ఉపసంహరించుకుంటారా లేదా అన్నదానిపై చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో న్యాయం చేస్తా మని పార్టీ హైకమాండ్‌ చెబుతున్నా రెబ ల్స్‌ నమ్మడం లేదని సమాచారం.. తిరుగుబాటు నేతలు ఉపసంహరణకు మొగ్గుచూపుతున్నా.. వారి అనుచరులు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఇచ్చే ప్రాధాన్యతపై ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబడుతున్నట్టు సమాచారం. అధిష్టానం బుజ్జగిం పులు ఫలించి, తిరుగుబాటు నేతలు పోటీలోనుంచి తప్పుకుంటారా, లేక బరిలోనే నిలిచి బలాన్ని తేల్చుకుంటారా అన్నది గురువారం సాయంత్రంలోగా తేలనుంది. 

మరిన్ని వార్తలు