‘యారో’ హీరో..

8 Dec, 2017 11:14 IST|Sakshi
ట్రోఫీ అందుకుంటున్న మోహిత్‌

కస్టమైజ్డ్‌ బైక్‌ను రూపొందించిన నగరవాసి

ఇండియా బైక్‌ వీక్‌లో ట్రోఫీ సొంతం

నగరవాసి రూపొందించిన బైక్‌ జాతీయస్థాయి పోటీల్లో గుర్తింపు పొందింది. సిటీ యూత్‌ కస్టమైజ్డ్‌ బైక్స్‌ మోజును చాటిచెప్పింది. కస్టమైజ్డ్‌ బైక్స్‌కు సంబంధించి ‘ఇండియా బైక్‌ వీక్‌’ (ఐబీడబ్ల్యూ) పోటీ ఇటీవల గోవాలో జరిగింది. ఇందులో సిటీకి చెందిన మోహిత్‌ చావ్డా అండ్‌ టీమ్‌ రూపొందించిన ‘యారో’ బైక్‌ ది బెస్ట్‌గా నిలిచి ‘బిల్డ్‌ ఆఫ్‌ విన్నర్‌’ ట్రోఫీ అందుకుంది. ఆ బైక్‌ కథా కమామీషు...

లక్షల ఖరీదైన బైక్స్‌ సిటీ రోడ్స్‌ మీద దౌడ్‌ తీయడం సర్వసాధారణమైపోయింది. సిటీజనులు ఇప్పుడు బైక్‌ ఎంత ఖరీదైందని చూడడం లేదు. ఎంత వైవిధ్యంగా ఉందనే చూస్తున్నారు. దీంతో కస్టమైజ్డ్‌ బైక్స్‌కి ప్రాధాన్యత పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమైజ్డ్‌ బైక్స్‌కు సంబంధించిన జాతీయస్థాయి కాంటెస్ట్‌ ఇటీవల గోవాలో జరిగింది. ఈ పోటీలో నగరవాసి రూపొందించిన బైక్‌ ‘బిల్డ్‌ ఆఫ్‌ విన్నర్‌’ ట్రోఫీ అందుకుంది. సిటీకి ఈ ట్రోఫీ దక్కడం ఇదే తొలిసారి. దీంతో బైక్‌ల వాడకంలోనే కాదు... బైక్స్‌ను సృష్టించడంలోనూ ముందున్నామని నిరూపించింది సిటీ. 

ఇండియా బైక్‌ వీక్‌ (ఐబీడబ్ల్యూ)...
ఆసియాలోనే అతి పెద్ద బైకర్స్‌ ఈవెంట్‌. ఈ ఈవెంట్‌ ప్రతిఏటా గోవాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల బైక్‌లు, వాటి యాక్ససరీస్‌ విక్రయ సంస్థలు, పోటీలు, అదరగొట్టే రాక్‌షోస్, విందు వినోదాల వేదిక ఈ ఈవెంట్‌. నవంబరు నెలాఖరులో గోవాలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి 20వేల మంది వరకు హాజరైతే... ఈసారి కూడా నగరవాసులు పెద్ద సంఖ్యలోనే వెళ్లారు. ఇందులో కస్టమైజ్డ్‌ బైక్స్‌కి సంబంధించిన
కాంటెస్ట్‌లో నగరవాసి సృష్టించిన బైక్‌ ‘యారో’ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బైక్‌ను క్రియేట్‌ చేసిన మోహిత్‌ చావ్డా అండ్‌ టీమ్‌ తమ బైక్‌ విశేషాలను ‘సాక్షి’తో పంచుకుంది.

వైవిధ్యమే గుర్తింపు..  
ఈ బైక్‌ను డిజైన్‌ చేసిన మాదాపూర్‌ నివాసి మోహిత్‌ 2014లో డెక్కన్‌ కస్టమ్‌ మోటార్‌ సైకిల్స్‌తో ప్రారంభించి, ఇప్పుడు నిజాంపేటలో 36 మోటోను ప్రత్యేకంగా కస్టమైజ్డ్‌ బైక్స్‌ కోసం నెలకొల్పారు. ‘బుర్రలో తిరిగే ఆలోచనల్ని ఆవిష్కరించడమే మోటార్‌ సైకిళ్ల రూపకల్పన. మనం ఎప్పుడు వైవిధ్యంగా ఏది సృష్టించినా నిస్సందేహంగా దానికి గుర్తింపు వస్తుంది’ అంటారు మోహిత్‌. ఈ బైక్‌ని విక్రయిస్తారా? అంటే ఆఫర్‌ని బట్టి ఆలోచిస్తామన్నారు. ఈ బైక్‌ సిటీ రోడ్ల మీద కనిపిస్తే కంగ్రాట్స్‌ చెప్పడం మరచిపోకండి. 

కేవలం  23 రోజుల్లో.

‘రెంచ్‌ అనేది మా పెయింట్‌ బ్రష్‌. రా స్టీల్‌ కాన్వాస్‌. కస్టమైజ్డ్‌ బైక్స్‌ ప్రదర్శించేందుకు ఐబీడబ్ల్యూ కరెక్ట్‌ వేదిక. ఆ విషయం తెలిసి వెంటనే మేం అనుకుంటున్న డిజైన్‌తో ఎంట్రీ పంపించాం. అలా దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల నుంచి షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈ పోటీలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటేమో మోడిఫైడ్‌ బైక్స్‌.. అంటే ఉన్న బైక్స్‌ని కొత్తగా తీర్చిదిద్డడం. రెండోది అతి క్లిష్టమైంది బిల్డ్‌ ఆఫ్‌... అంటే  పూర్తిగా కొత్త బైక్‌ని క్రియేట్‌ చేయడం. ఈ విభాగంలో మాకు అవకాశం దక్కింది. దాంతో పని ప్రారంభించి కేవలం 23 రోజుల్లోనే ‘యారో’ని సృష్టించి, బిల్డ్‌ ఆఫ్‌ విన్నర్‌ ట్రోఫీ గెలుచుకున్నాం. మా బృందంలో మహ్మద్‌ అబూ సుఫియాన్, గౌతమ్‌ (ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్‌), సయ్యద్‌ జైన్, సయ్యద్‌ అల్తాఫ్‌ (మెకానికల్‌), ప్రీతమ్‌ (డిజైనింగ్, బ్రాండింగ్‌), దేవిరెడ్డి, సంతోష్,

జగ్మీత్‌ సింగ్‌
సభ్యులు. మేం రూపొందించిన కేఫ్‌ రేసర్‌ స్టైల్‌  బైక్‌ కోసం 1985 యమహా ఆర్‌డీ 350 టార్క్‌ని వాడాం. క్రియేట్‌ చేసిన బైక్‌లో ఇంజిన్, ఛాసిస్‌ మాత్రమే పునర్వినియోగం అయ్యాయి. మిగిలినవన్నీ మేం తయారు చేసినవేన’ని చెప్పారు బైక్‌ డిజైనర్‌ మోహిత్‌ చావ్డా.    

మరిన్ని వార్తలు